నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరం
గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ, అక్షిత ప్రతినిధి:
నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు. ఒకపక్క వర్షాలు, మరోవైపు నిత్యావసరాల ధరలతో పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తూ దాడులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు మంచిది కాదని సూచించారు. సీబీఐ, ఈడీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేనను బెదిరించి ప్రభుత్వ మార్పుకు తెగబడ్డారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.23 వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందన్నారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతోపాటు పాలు, పెరుగు, చివరకు స్మశాన వాటికలు కూడా వదలకుండా జీఎస్టీ వేశారని ఫైరయ్యారు. పేదల బతుకు దుర్భరంగా ఉందని చెప్పారు. పెరిగిన ధరలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి నూతన జీఎస్టీ విధానాలను విరమించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.