వర్షాలు… వరదలపై కేసిఆర్ సమీక్ష

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలో అధికంగా కురుస్తున్న వర్షాలు, వరదనష్టం నివారణ చర్యలు, అంటువ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం ఉదయం న్యూడిల్లీ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని భారీ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లలో భారీగా వస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా టెలికాన్ఫరెన్స్ లో ఆయన ప్రస్తావించారు.
అన్ని శాఖల అధికారులు సహయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున, జిహెచ్ ఎంసి, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఆ చెరువుల్లో వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికార యంత్రాంగం సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. సహాయ పునరావాస శిబిరాలను ఇప్పటికే జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిందని, అవసరమైన పక్షంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆ శిబిరాలకు తరలించాలని ఆయన చెప్పారు.

 

రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలు, చెరువులకు పడే గండ్లు, విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని, ఆ ప్రాంతాలలో పౌర నష్టం జరగకుండా తగు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
అధికారులు, సిబ్బంది తమ ప్రధాన కార్యాలయంలోనే అందుబాటులోనే ఉండాలని, ఎలాంటి వరద నష్టం సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, పోలీస్ శాఖ అడిషనల్‌ డైరెక్టర్ జనరల్ జితేందర్‌, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్ వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్‌, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ జైన్, దక్షణ మండలం విద్యుత్ పంపిణి సంస్థ సి.ఎం.డి రఘుమా రెడ్డి, ఉత్తర మండలం విద్యుత్ పంపిణి సంస్థ సి.ఎం.డి. గోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking