దొరది కాదురో.. మునుగోడు మనదిరా!

*దొరది కాదురో..
మునుగోడు మనదిరా!

*గంజి తాగైనా బహుజన రాజ్యం సాధిస్తం*

డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

మునుగోడు,  అక్షిత  ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 5వ స్వాతంత్య్ర ఉద్యమం సాగుతుందని తెలిపారు. ఈ ఉద్యమం ద్వారా పేదలు, బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పాలకులుగా మారుతారని పేర్కొన్నారు. 1947 భారత స్వాతంత్య్ర ఉద్యమం,1948లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం, 2009లో తెలంగాణ మలి దశ?పోరాటం జరిగాయి కానీ ఈ పోరాటాలలో పాల్గొన్న బహుజనులు ప్రాణాలు త్యాగాలు చేశారని,జీవితాన్ని కోల్పోయినారని కానీ ఈ పేదల బతుకులు మాత్రం మారలేదన్నారు. ఈ?ఉద్యమాల ద్వారా ఆధిపత్య వర్గాలే అధికారంలోకి వచ్చారని,బహుజన ప్రజలంతా జెండాలు మోసే కార్యకర్తలుగానే మిగిలారని ఇది ఒక ప్రణాళిక బద్దంగా జరిగిన కుట్ర అని తెలిపారు. అందుకే ఇపుడు జరుగబోయే 5వ స్వాతంత్య్ర పోరాటం ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులను పాలకులుగా చేస్తూ రాజ్యాధికారం సాధిస్తుందని ప్రకటించారు.

ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా పాల్గొనాలని,బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈ ఉద్యమాన్ని గెలవాలని,విజయం సాధించాలని అందుకు ఏనుగు గుర్తుకే ఓటేసి బిఎస్పిని గెలిపించాలని కోరారు. చావుకు తెగించి పనిచేస్తున్నామని,మా గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.పోలీసులు టిఆర్ఎస్ కు ఒకరకంగా, బిజెపికి ఒక రకంగా,బిఎస్పికి మరో రకంగా పని చేయవద్దని కోరారు.మా పోరాటం ఫాంహౌస్ ల కోసం, బంజారాహిల్స్ లో ఇళ్ళ కోసం జరిగేది కాదని, ఆత్మగౌరవం కోసం,బతుకులు మార్చడం కోసం జరిగే పోరాటమని తెలిపారు. ఒక్క రోజు కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్దికి కావాల్సిన నిధుల కోసం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేసిన మహిళల వ్యతిరేక పార్టీ బిజెపి అని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై, ఈడీ,సిబిఐ పేరుతో బెదిరిస్తున్న పార్టీ బిజెపి అని, ఈ పార్టీల వారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, తెలంగాణకు ఈ పార్టీని రానివ్వద్దని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ బిసి వ్యతిరేక పార్టీ అని ప్రకటించారు. బిసి కార్పోరేషన్లకు, బిసి ఫెడరేషన్లకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు. దళిత బంధు ఒక్కరికి ఇచ్చి వందమందికి మోసం చేశారని తెలిపారు.గిరిజన యూనివర్సిటీ,గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇపుడు గిరిజన బంధు పెట్టి మళ్లీ మోసం చేస్తున్నారని తెలిపారు. పేదలందరికీ ఎకరం భూమి కావాలంటే,పేద బిడ్డలు విదేశాల్లో చదవాలంటే,పేదలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ లు రావాలంటే, పేదలు వంద ఏళ్లు బతకాలంటే,అసైన్డ్ భూములకు,పోడు భూములకు పట్టాలు రావాలంటే బిఎస్పికి ఓటేయాలని తెలిపారు.
దొర ఏందిరో, వాని పీకుడేందిరో అంటూ పాట పాడారు.సుత్తి కొడవలి,పార పలుగు పట్టినోల్లం మేము మమ్మల్ని బెదిరించాలని చూస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం నడుస్తం కాబట్టి ఏమి అనట్లేదని తెలిపారు.మ బిఎస్పి జెండా పట్టుకున్నవారిని బెదిరించాలని చూస్తే,ఎట్టిపరిస్థితులో ఊరుకోమని హెచ్చరించారు.

బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడత ప్రారంభోత్సవ సభ మునుగోడులో జరిగింది.ఈ సందర్భంగా ఎల్ బి నగర్ నుండి ప్రారంభమై వందలాది కార్లతో రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ కొనసాగింది.ర్యాలీలో భాగంగా హయత్ నగర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి,ఆందోళ్ మైసమ్మ గుడిలో వేలాదిమందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం అక్కడే వెంట తెచ్చుకున్న సద్ది అన్నం తిని,అక్కడనుండి చౌటుప్పల్ కేంద్రంలో సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహానికి మరియు ధర్మభిక్షం గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్థాన నారాయణపురంలోని ప్రాచీన శ్రీ ఉమా మహేశ్వర శివాలయంను దర్శించుకున్నారు. డప్పులు,కోలాటాలు మరియు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. బిడ్డా 65 ఏళ్లుగా మా బిసి,ఎస్సి,ఎస్టీ బిడ్డలను మీ బూట్ల కింద అణచివేసిండ్లు,ఇక నడువదు,అంతు చూస్తాం జై మునుగోడు అని నినదించారు. ఒకడు తిన్నదరగక రాజీనామా చేస్తే,ఇంకొకడు 1300 మంది అమరుల త్యాగాలకు,ఆశయాలకు తూట్లు పొడుస్తూ పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశసంపద మొత్తం అంబానీ అదానీలకు దోచి పెడుతున్న బిజెపిని రాజగోపాల్ రెడ్డిని ఓడించాలన్నారు. పాడు పడ్డ భంగుళాల్ల మా పిల్లలకు చదువులు,మీ పిల్లలకేమో ఎసి గదుల్లో చదువులా…? మీకేమో యశోదలో వైద్యం,మాకేమో పాములు వచ్చే సర్కారు దవాఖానలో చదువులా? నహీ చలేగా అని నినదించారు. మునుగోడు నుండి వందలాది కుటుంబాలు ముంబాయి వలస పోయి బతుకుతున్నరు.అందుకు కారణం మీరేనని, మునుగోడు ప్రజలను మోసం చేసిన నిందితులు,దోషులే మళ్లీ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. బిఎస్పి పేదల పార్టీ,తెలంగాణలోని ఎస్సీ,ఎస్టీ,బిసి మైనారిటీల గొంతై,దొరల పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుందని తెలిపారు.మొదటి దశ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని,మాయావతి ఆశీర్వాదంతో రెండవ దశ ప్రారంభించామని తెలిపారు.మునుగోడులో ఉప ఎన్నిక ఉన్నందున యాత్ర మునుగోడు నుండి చేపడుతున్నామని తెలిపారు.70 ఏళ్లుగా మునుగోడులో కాంగ్రెస్,కమ్యూనిస్ట్,టిఆర్ఎస్ పార్టీల ఆధిపత్య పాలనలో ప్రజల జీవితాలు ఆగమయ్యాయన్నారు. దేశసంపదనంతా దోచుకొని, అంబానీ,అదానిలకు పంచిపెడుతున్న బిజెపి పార్టీని,పేదలను హింసిస్తూ గడీల పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ పాలనను ఓడించడమే లక్ష్యంగా బిఎస్పి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఇబ్రహీంపట్నంలో కుటుంబనియంత్రణ ఆపరేషన్ ఫెయిలై మరణించిన మహిళలను కనీసం పరామర్శించని రాష్ట్ర కేబినెట్ ను గవర్నర్ భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రద్దుచేయాలని చూస్తున్న బిజెపి, టిఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనమైందన్నారు. మునుగోడులో కనీసం డిగ్రీ కాలేజి కూడా పెట్టలేదని, గజ్వేల్ లో మాత్రం ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ది చేశారని గుర్తుచేశారు.చర్లగూడెం ప్రాజెక్టును పట్టించుకోకుండా మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు మాత్రం పూర్తి చేసారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేయకుండా,కెసిఆర్ ఫాంహౌస్ కు మాత్రం నాలుగులైన్ల రోడ్ వేసుకున్నాడని,కెసిఆర్ కు మునుగోడు ప్రజల మీద ప్రేమ లేదన్నారు.బిఎస్పి పార్టీ ఇతర పార్టీల వలే బీర్లు,బిర్యానీలు,డబ్బును పంచి,గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేయదన్నారు. మునుగోడు కేంద్రంలో విఆర్ఏల సమ్మెలో పాల్గొని,సంఘీభావం ప్రకటించారు.తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే లాఠీచార్జ్ చేసి హింసించారని విమర్శించారు.విఆర్ఏలకు,విఆర్వోలకు న్యాయం కావాలంటే,రెవెన్యూశాఖ గొప్పగా అభివృద్ది చెందాలంటే బిఎస్పి గెలవాలని సూచించారు. ఫూలే,అంబేడ్కర్,పాపన్నగౌడ్,పండగసాయన్న,ఐలమ్మ వంటి మహనీయుల ఆశయాలను 1300 మంది అమరుల ఆశయాలను నెరవేర్చే పార్టీ బిఎస్పి అని స్పష్టం చేశారు.ఇతర పార్టీలలోని బిసిలందరూ బిఎస్పిలోకి రావాలని పిలుపునిచ్చారు. రేపటి నుండి యాత్ర బువ్వ లేకపోతే గంజి అయినా తాగి యాత్ర చేసి గత పాలకుల అన్యాయాన్ని తెలియజేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు మంద ప్రభాకర్, దయానందరావు, సైదులు, అనితరెడ్డి, నిర్మల, శంకరాచారి, మాల్గా యాదయ్య, ఏర్పుల అర్జున్, పల్లె లింగస్వామి, పందుల హరీష్, తీగల రమేష్, పందుల సురేష్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking