*దొంగ బాబాతో కుమ్మక్కైన ఆర్ ఐ?

*దొంగ బాబాతో కుమ్మక్కైన రెవెన్యూ ఇన్స్పెక్టర్..?*

• దమ్ముంటే కూల్చివేయండి
• దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా..
• వాటాలేసుకుని కమీషన్లు పంచుకుంటున్న ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు
• మీటరుకు పదిహేను వేలు తీసుకుంటూ కరెంటు కనెక్షన్లిస్తున్న ఏఈ సత్యనారాయణ
• క్యాష్ కొట్టు.. మీటరు పట్టు..
• ప్రభుత్వ భూములు మాయమవుతున్నా పట్టించుకోని ఆర్డీవో
• జిల్లా కలెక్టర్ గురించి చెప్పనక్కర్లేదు, ఆయన డ్రైవరే అన్నీ చూసుకుంటారు..?
• ఒకరు కబ్జాదారుడు.. మరొకడు సెటిల్మెంట్ కింగ్
• సామాన్య ఫొటోగ్రాఫర్ కోట్లకు పడగలెత్తిన వైనం
• బాబా వెంచర్లో ఏం జరుగుతుంది..?
• బాబా మంత్రమేస్తే ప్రభుత్వ భూమి మాయం
• బాబా మంత్రానికి ఎమ్మార్వో అయినా మూలన కూచోవాల్సిందే
• పదెకరాల ప్రభుత్వ భూమి మాయమవుతున్నా చలనం లేని ఎమ్మార్వో సంజీవరావు
• చర్యలు తీసుకోకుంటే ‘తగ్గేదే లే..’దంటున్న సామాజిక కార్యకర్తలు

*మేడ్చల్ – మాల్కాజ్గిరి జిల్లా జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, దేవేందర్ నగర్ లోని సర్వే నంబర్ 342, 342/1, 329/1 లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురౌతున్నాయి. కొన్ని వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఒక్కొక్కరుగా కొన్ని ఎకరాలకెకరాలు, తమ సొంత భూముల్లా కొన్ని భాగాలుగా పంచుకుని మరీ 60, 80, 100 గజాల చొప్పున ప్లాట్ లుగా ఏర్పాటు చేస్తూ దేవేందర్ నగర్, కట్టమైసమ్మ బస్తీ, రావి నారాయణ రెడ్డి నగర్, గాలిపోచమ్మ బస్తీ, సాబేర్ నగర్, లాల్ సాహబ్ గూడ, కైసర్ నగర్ లలో మాయం చేస్తూ కోట్లకు పడగలెత్తారు సదరు భూకబ్జాదారులు. ఇంత జరుగుతున్నా ఈ భూకబ్జాదారులపై ఇక్కడి తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విద్యుత్ శాఖ అధికారులు అందినకాడికి దండుకుంటూ, నామమాత్రపు కేసులు నమోదు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.*

కుత్బుల్లాపూర్,అక్షిత ప్రతినిధి :

రోజు రోజుకి భూముల ధరలు ఏకంగా ఆకాశానికి తాకుతున్నాయి. ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఎప్పటికైనా భూమి విలువ పెరుగుతుంది కానీ తగ్గదని తెలుసుకున్న కబ్జాదారులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా భూముల పైన కన్ను వేశారు. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేయాల్సిందే.. తమ పేరిట బోర్డు పాతాల్సిందే. ఇక వివారాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గాజులరామారం డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్. 342/1 లోని సుమారు 8 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా‌కి గురైందని స్థానికులు చెబుతున్నారు.

 

*దర్జాగా కబ్జా*

గాజుల రామారావు డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 342లోని 8 ఎకరాల 20 గంటల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు దర్జాగా కబ్జా చేశారని ప్రజలు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా విషయం బయటకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూమిలోకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు. కబ్జాదారులు ప్రైవేట్ వ్యక్తులను కాపలాగా ఉంచి ఎవరిని వెళ్ళనివ్వకుండా చూసుకుంటున్నారు. ఒక వేళ లోపలికి వెళ్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు అక్కడికి ప్రజలు వెళ్లాలంటనే భయపడుతున్నారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజాలది కదా కాబట్టి మాదే అనుకుంటే తప్పేముంది అని అనుకున్నారో ఏమో కబ్జా చేశారు.

 

*ప్రభుత్వ భూములకు రక్షణ కరువు*
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన తరువాత విషయం తెలుసుకున్న వారు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. అసలు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సబంధితశాఖ అధికారులది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ముడుపులు తీసుకోవడం‌లో ఉన్న శ్రద్ధ వారి పని తీరు పై లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బడా బాబులు, నాయకులతో చేతులు కలిపే ఈ తంతు నడిపిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

*రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు*

కొందరు అక్రమార్కులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో ఖాళీ‌గా ఉన్న భూములపై కన్నెస్తున్నారు. కబ్జా చేసి విక్రయిస్తున్నారు. కొందరు అక్రమార్కులు అధికారులను, చోటా మోటా నాయకులను కలుపుకొని వారి చేతులు తడుపుతూ యథేచ్ఛగా దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే అక్రమార్కులు కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. వారి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*తెర వెనుక దాగున్నది ఎవరు..?

ఈ భూమిలో ఓ ఫోటో గ్రాఫర్ ప్రభుత్వ భూమి‌ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతూ మధ్యతరగతి ప్రజలకు విడిగా ఫ్లాట్లు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అసలు సబంధితశాఖ అధికారులు ఉన్నా కూడా ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది అంటే వారి పని తీరు బాగా లేదని ప్రజలు అంటున్నారు.

*బాబా వెంచర్ పై ఎందుకంత ప్రేమ*
ప్రభుత్వ భూమి కబ్జా అయిన విషయం తెలిసినా కూడా స్థానిక ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. పలు సార్లు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి దాటివేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో అన్ని తెలిసినా ఉన్నత అధికారులు స్పందించడం లేదంటే ఆంతర్యం ఏమిటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జా నుండి విముక్తి చేసి ప్రజావాసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.

*బాబా శరణం.. సాయీ శరణం సాయీ..*
గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్ లో ఓ నకిలీ బాబా వెలిశాడు. ఈ బాబాకు పూలతో.. పండ్లతో పనిలేదు. కేవలం ప్రభుత్వ భూములుంటే చాలు. గత అయిదు సంవత్సరాల క్రితం రోడామేస్త్రీ కి చెందిన ఓ వృద్దుడిని ఆసరాగా చేసుకుని స్థానిక సర్వే నంబర్ 342, 342/1 లోని ప్రభుత్వ భూముల్లో అమ్మకాలు మొదలు పెట్టిన ఈ బాబా ఏకంగా ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టాడు. సుమారు ఇరవై కోట్ల రూపాయాలు విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇప్పటికే వంద అక్రమ నిర్మాణాలు చేపట్టి, వాటికి కరెంటు మీటర్లు కూడా బిగించారు. రెవెన్యూ, కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు మూకుమ్మడిగా అమ్ముడుపోయి తమ విధులనే మర్చిపోయారు. ఇక్కడ మాత్రం స్థానిక లాల్ సాహబ్ గూడ వాస్తవ్యుడైన ఓ బాబా అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వ భూములను ఆసరాగా చేసుకున్న ఇతగాడు అమాయక పెద ప్రజలను నమ్మించి ఇప్పటికే ఒక్కో ప్లాటును పది నుంచి పదిహేను లక్షలకు అమ్ముకుంటూ సుమారు పదిహేను కోట్ల రూపాయలు దండుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే డబ్బులతో కైసర్ నగర్ లో రెండు వందల గజాల స్థలంలో రెండు అంతస్తుల ఇల్లు నిర్మించుకుని జల్సా జీవితాన్ని గడుపుతున్నట్టు సమాచారం. ఈయనకి యాభై శాతం పార్టనర్ గా ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ కూడా దండిగానే సంపాదించినట్టు స్థానిక ప్రజలు కోడై కూస్తున్నారు. ఇక్కడ పంచుకున్న వాటాలతో గాజులరామారంలోని ఓ వెంచర్లో డూప్లెక్స్ హౌస్ నిర్మిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ కలిసి స్థానిక ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని మేనేజ్ చేయాలంటూ ఒక్కో ఇంటి నిర్మాణదారుడి నుంచి లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఒక కోటి రూపాయలు ముట్టజెప్పినట్టు సమాచారం. దీనికి తోడు ఒక్కో కరెంటు మీటరుకు పదిహేను వేల రూపాయలు ముట్టజెప్పి.. ఏఈ సత్యనారాయణకు కొన్ని లక్షలు ముట్టజెప్పి కరెంటు కనెక్షన్ తీసుకున్నారంటూ ఇక్కడి ప్రజలు కోడై కూస్తున్నారు. ఇకనైనా ఇక్కడి పినాకిని క్రషర్ మిషన్ పక్కన వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. పూర్తి వివరాలతో దొంగ బాబా, నకిలీ ఫోటో గ్రాఫర్ చేస్తున్న ఆగడాలపై మరిన్ని కథనాలు త్వరలో..

Leave A Reply

Your email address will not be published.

Breaking