మిర్యాలగూడ సమగ్రాభివృద్ధికి కృషి

మిర్యాలగూడ సమగ్రాభివృద్ధికి కృషి

* కోటి రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం
పనులకు శంకుస్థాపన

* ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్టు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ మండల పరిధిలోని ఉట్లపల్లి, తక్కెళ్లపాడు, జేత్యాతండా, దొండవారిగూడెం, తడకమల్ల గ్రామాలకు ఎస్డీఎఫ్ గ్రాంట్ నుంచి ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున కోటి రూపాయలు మంజూరయ్యాయి. ఈ మొత్తంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణం పనులను భాస్కర్ రావు శనివారం ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. గత పాలకులు గ్రామాల్లో అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని, కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ భారత్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలే అగ్ర జాబితాలో చోటు దక్కించుకోవడం దీనికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం విరాజిల్లుతున్నదని ప్రశంసించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

 

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తీరొక్క పూలను పేర్చి నిర్వహించే బతుకమ్మ పండుగ ప్రాధాన్యం మరింత పెరిగిందని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, మాజీ ఏఎంసీలు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పంచాయతీ రాజ్ డీఈ వెంకటేశ్వర్ రావు, ఎంపీడీవో జ్యోతి లక్ష్మి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య, ప్రధాన కార్యదర్శి పిస్కె సైదులు, పాశం నర్సింహా రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking