మీడియా అకాడమీ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
మంత్రి ప్రశాంత్ రెడ్డికి అల్లం వినతి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని డిసెంబర్ చివరికల్లా పూర్తిచేయాలని, రోడ్లు-భవనాల శాఖ మంత్రి, ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డిని ఆదేశించారు.
మంత్రిని మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ, ఆయన నివాసంలో కలిసి, అకాడమీ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేసి, వినతి పత్రం సమర్పించారు.
ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో జరిగిన మీడియా సెమినార్లో, పురపాలక శాఖ మంత్రి, కేటీఆర్ కూడా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేసి ముఖ్యమంత్రి చే ప్రారంభింప చేయిస్తామని తెలిపిన విషయం చైర్మన్ గుర్తు చేశారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్, అమర వీరుల స్థూపం ప్రారంభోత్సవం, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు వచ్చే జనవరి మాసంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, వాటితోపాటు నాంపల్లి, చాపెల్ రోడ్డులో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించేలా చూడాలని అల్లం నారాయణ, మంత్రికి విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రోడ్లు – భవనాల శాఖ అధికారులను, అకాడమీ భవన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.