ఉద్యోగుల, సిబ్బంది రక్షణకు ఆయుధాలివ్వాలి

ఉద్యోగుల, సిబ్బంది రక్షణకు ఆయుధాలివ్వాలి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో అరణ్య భవన్ లో పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ సమావేశమయ్యారు. ముందుగా శ్రీనివాసరావు మృతికి నివాళులు అర్పించిన అధికారులు, సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆ తర్వాత జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్, ఫారెస్ట్ రేంజర్లు, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐ.ఎఫ్.ఎస్ అసోసియేషన్- తెలంగాణ చాఫ్టర్ ప్రతినిధులు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. అటవీ సంరక్షణ పట్ల నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బందిపై దాడులను నిరసించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూడాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. సంఘటన తర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణం స్పందించిన తీరుకు సంఘాల ప్రతినిధులు కృతజ్జతలు చెప్పారు.

క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు ఆయుధాలను ఇచ్చే ప్రతిపాదనను వెంటనే పరిష్కరించాలని, ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం మరింతగా పెంచాలని, అన్ని బీట్లలో అటవీ సరిహద్దులను ఖచ్చింతగా గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని సంఘాలు కోరాయి. గుత్తి కోయలు పోడు సాగుదారుల కిందకు రారని, వారిని పూర్తిగా అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి, అడవి నుంచి బయటకు తీసుకువచ్చే కార్యచరణ ప్రభుత్వం తీసుకోవాలని ప్రతిపాదించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు, ఫీల్డ్ లెవల్ లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ హామీ ఇచ్చారు.

సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, ఇతర అధికారులు, సిబ్బంది, అన్ని అటవీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking