క్రీడా స్ఫూర్తి నింపేందుకు క్రీడలు ఉపయుక్తం

 

శారీరక, మానసిక దారుడ్యo పెంపుదల

మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
యువతలో క్రీడా స్ఫూర్తి నింపి,క్రీడలలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సి.ఎం.కప్ పోటీలను నిర్వహిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.క్రీడలు శారీరక, మానసిక దారుడ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యమని చదువుతోపాటు ఆటల్లో రాణించాలని అన్నారు.సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం లో మేకల అభినవ్ ఔట్ డోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సి.ఎం.కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో ఉండడమే కాక, వెయ్యి కి పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులను దేశం లోనే కాకుండా ప్రపంచం లో పోటీ పడేలా తయారు చేస్తుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వము క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు గెలుపు ఓటముల మధ్య ఒత్తిడి లను తట్టుకునే శక్తిని ఇస్తాయని అన్నారు. విద్యార్థులు ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలని, మరలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. గెలుపును పునాదిగా వేసుకొని ఆ రంగంలో మరింత రాణించేందుకు పట్టుదలతో కృషి చేయాలని ఆయన అన్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంత క్రీడా కారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సి.ఎం.కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు. ఈ క్రీడా పోటీలలో 5140 మందికి పైగా క్రీడాకారులు మండల స్థాయిలో పాల్గొని, 1411 మంది క్రీడాకారులు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. నేడు ఇక్కడ జరుగుతున్న జిల్లా స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు.

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారులకు చేయూతనిచ్చి ముందుకు తీసుకు వెళుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అని ఆయన అన్నారు. ఆటల వల్ల దేహదారుద్యం పెంపొందడంతో పాటు ఆరోగ్యంగా జీవించడం అలవడుతుందని ఆయన తెలిపారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలలో పాల్గొనే వ్యక్తులకు ధైర్యము, ఆత్మస్థైర్యము పెంపొందుతుందని తెలిపారు. చిన్నచిన్న సమస్యలకే నేడు సమాజంలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అలా కాకుండా రోజు వ్యాయాయం చేసి క్రీడల్లో పాల్గొనేవారు చరిత్రలో ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవని ఆయన వివరించారు.గెలుపు, ఓటములు గురించి ఆలోచించకుండా క్రీడా స్ఫూర్తి తో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు ఎన్ భాస్కరరావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అర్.మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా,అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు, జిల్లా యువజన క్రీడల అధికారి మక్బూల్ అహ్మద్,జడ్.పి.సి.ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణా చారి,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.కర్తయ్య,
ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking