బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

-ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ
పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలి

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వపాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బడి బాట, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పూర్తిపై విద్యాశాఖ ఇంజనీరింగ్ మండల సమాఖ్యలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని అన్నారు. గుర్తించిన పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పన ఇంగ్లీష్ మీడియం బోధనపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం తేవాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశం నిర్వహించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకొని అప్ గ్రేడ్ అవుతున్న ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న చిన్నారు లందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ విద్యా బోధన పై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్డు టాయిలెట్స్ మిగిలిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. వారంలోగా పనులన్నీ పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా సంఘాలే పనులు చేపట్టాలని నిధుల మంజూరు విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన తెలిపారు.ఈ నెల 12వ తేదీ వరకు పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు యూనిఫామ్స్ విద్యాశాఖ అధికారులు సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. పాఠశాలల్లో శానిటేషన్ సంబంధించిన పనులు చేపట్టాలని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి సంబంధించి అన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉన్నచోట పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను సైతం మరింత బలోపేతం చేయాలని సూచించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజున పాఠశాలలను అరటి మామిడి ఆకులతో అలంకరణ చేయాలని పండుగ వాతావరణం స్పూరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రవేశం ఆవరణలో వీధిదీపాల ఏర్పాటుచేయాలని ఆయన తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking