విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
– రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
– సీఈ బాలస్వామి
రామన్నపేట , అక్షిత ప్రతినిధి:
రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీఈ బాలస్వామి తెలిపారు. గురువారం మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతు ఐలాపురం చంద్రమౌళితో మాట్లాడారు. విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితి, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండించే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భూగర్భజలాల వినియోగం తగ్గడంతోపాటు వ్యవసాయ విద్యుత్‌ను ఆదా చేయవచ్చని వివరించారు. రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.
లో-ఓల్టేజ్ సమస్యకు పరిష్కారం
కొమ్మాయిగూడెం గ్రామంలో నెలకొన్న లో-ఓల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను సీఈ బాలస్వామి ప్రారంభించారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ సమస్యలు తగ్గి రైతులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ డి. మల్లికార్జున్, ఏడీఈ కే. శ్రీకాంత్, ఏఈలు ఎం. కోటేశ్వరరావు, జి. నరసింహ, గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు, కాంట్రాక్టర్ జి. రాంరెడ్డి, విద్యుత్ సిబ్బంది ఎం. నటరాజ్, టి. అశోక్, కే. శ్రీనివాస్ రెడ్డి, కే. సత్తిరెడ్డి, ఎం. సురేష్, ఎం. యాదగిరి, ఎండి. చాంద్ తదితరులు పాల్గొన్నారు.