చిన్నకాపర్తిలో సుదర్శన క్రియ, యోగా ధ్యాన కార్యక్రమాలు ప్రారంభం
– ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి..
– యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత
– గుత్తా అమిత్ కుమార్ రెడ్డి
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించేందుకు సుదర్శన క్రియ, యోగా, ధ్యానం ఎంతగానో దోహదపడతాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పేర్కొన్నారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సహకారంతో వారం రోజులపాటు నిర్వహించనున్న సుదర్శన క్రియ, యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు బుధవారం గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు గురువందనం సమర్పించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గ్రామస్థులు, యువకులు, భవాని మాలధారులకు ప్రత్యేకంగా వార్మప్ వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయించారు. ఆయా సాధనల ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. గురుదేవ్ రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, మానవతావాదం, శాంతి సందేశాన్ని విస్తరిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యం ద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా సానుకూల మార్పు తీసుకురావాలన్న ఆయన ఆశయం ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ప్రతిరోజూ సుదర్శన క్రియ, యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని, సానుకూల దృక్పథంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. ఈ సందర్భంగా గుత్తా అమిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉంటూ యోగా, సుదర్శన క్రియ వంటి సాధనల ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలని పిలుపునిచ్చారు. యువత సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాలకు సహకరిస్తున్న గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డికి గ్రామస్థులు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, ఆవుల రమేష్ యాదవ్, పొలిమేర దశరథ, శిలివేరు పరమేష్, గురిజ శంకరయ్య, ఈరమళ్ల శ్రీను, ఈరమళ్ల వెంకన్నతో పాటు భవాని మాలధారులు, విద్యార్థులు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


