యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణంలో నాణ్యత ఏది….!
– రూ.200 కోట్ల పనుల్లో నాసిరకం ఇసుక వినియోగంపై ఆరోపణలు….!
– నిర్మాణ పనులపై ఇంజనీర్ల పర్యవేక్షణ ఏదీ?
నిజామాబాద్, అక్షిత బ్యూరో:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా సమీకృత పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం రాంగంగానగర్ గ్రామ సమీపంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనుల్లో పునాదుల భర్తీకి వినియోగిస్తున్న మొరం, ఇసుక నాణ్యతపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనులపై ప్రభుత్వ ఇంజనీర్ల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వినియోగిస్తున్నారా ?
పునాదుల భర్తీకి అవసరమైన మొరం కోసం కోటగిరి మండలం ఎత్తొండ ప్రాంతం నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో సాలూరా మండలం హున్సా శివారులోని మంజీరా నది నుంచి మట్టితో కూడిన ఇసుకను తరలించి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు పొందిన ప్రాంతం నుంచి కాకుండా ఇతర ప్రాంతం నుంచి మట్టి ఇసుకను తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
పునాదుల భర్తీలో మట్టితో కూడిన ఇసుకను వినియోగించి, దానిపై కొద్దిపాటి మొరం వేసిన అనంతరం సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న పాఠశాల భవనంలో ఇసుక, మొరం, కంకర నాణ్యతపై సంబంధిత ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పాఠశాల భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలకు తావివ్వకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వినియోగిస్తున్న నిర్మాణ సామగ్రి నాణ్యతను పరీక్షించాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
