సుదర్శన క్రియ, యోగ, ధ్యానంతో విజయానికి బలమైన పునాది
– హ్యాపీనెస్ కోర్సుకు సహకరించిన గుత్తా అమిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
చిట్యాల అక్షిత ప్రతినిధి
ప్రతిరోజూ సుదర్శన క్రియ, యోగ, ధ్యానం సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందించుకొని జీవితంలో విజయాలను సాధించేందుకు బలమైన పునాది ఏర్పడుతుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, యోగా టీచర్ పల్లపు బుద్ధుడు అన్నారు. చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీనెస్ కోర్సు ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు షార్ట్ సుదర్శన క్రియ, యోగ, ధ్యాన సాధనలను బోధించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ.. యోగాసనాలు, సూర్యనమస్కారాలు, పద్మసాధన, త్రీ స్టేజ్ ప్రాణాయామం, భస్త్రిక, ధ్యానం వంటి సాధనలు శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించడంలో దోహదపడతాయని తెలిపారు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఒత్తిడిని నియంత్రించుకోవచ్చని పేర్కొన్నారు. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ బోధించిన సుదర్శన క్రియ ద్వారా అంతర్గత శక్తిని గుర్తించి ప్రశాంతమైన, ఆనందమయమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. శాంతియుత సమాజ నిర్మాణానికి ధ్యానం, సేవాభావం, మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
గుత్తా అమిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
చిన్న కాపర్తిలో హ్యాపీనెస్ కోర్సు నిర్వహణకు సహకరించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి పల్లపు బుద్ధుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, యువతలో యోగ, ధ్యానంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం యోగా టీచర్ పల్లపు బుద్ధుడిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామంలో విద్యార్థులు, యువత కోసం ఇలాంటి యోగ, ధ్యాన శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పల్లపు ప్రశాంత్, పొలిమేర దశరథ, శేఖర్, ఆవుల రమేష్, వలిగొండ సత్యనారాయణ, శిలివేరు పరమేష్, గురిజ శంకరయ్య, దయాకర్, ఈరమళ్ళ శ్రీను, ఈరమళ్ళ వెంకన్న, శ్రీను, మహేష్, నరసింహ, స్వామి తదితరులతో పాటు భవానీ మాలధారణ స్వాములు, యువకులు పాల్గొన్నారు.
