పత్రికా స్వేచ్ఛతోనే
ప్రజాస్వామ్యానికి బలం
పత్రికా స్వేచ్ఛ
ప్రజాస్వామ్యం పరస్పర ఆధారితాలు
మహిళా జర్నలిస్టుల
స్వేచ్ఛను కాపాడాలి
మహిళల ఆర్థిక
పరిపుష్టికి కృషి
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు ప్రారంభ సభలో మంత్రి సీతక్క
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“మన గణతంత్రం, మన పత్రికా రంగం రెండూ కలిసే ఎదుగుతాయి.. లేదా కలిసే పతనమవుతాయి” అన్న ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్ పులిట్జర్ మాటలు స్వేచ్ఛాయుత మీడియా, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా విషయంలో అధికారాన్ని ప్రశ్నించే మహిళా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

ప్రశ్నలను అణచివేయడంలో కాకుండా, వాటికి సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య బలం ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు (నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్స్)ను మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా జర్నలిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతలను భయం లేకుండా నిర్వర్తించగలగాలని, నిజాలను వెలుగులోకి తీసుకురావడం, అధికారాన్ని ప్రశ్నించడం వారి వృత్తిపరమైన హక్కులని అన్నారు. జర్నలిస్టుల చేతిలోని మైక్రోఫోన్‌ను శత్రుత్వానికి చిహ్నంగా చూడకూడదని, అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడిగినంత మాత్రాన వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణించకూడదని పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడులు, లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీతక్క అన్నారు. ఈ ఘటనలకు సంబంధించి మహిళా జర్నలిస్టులపై కేసులు నమోదైనట్లు వచ్చిన నివేదికలను కూడా నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వృత్తిపరమైన విధులు నిర్వహించే మహిళలు బెదిరింపులు, ప్రతీకార చర్యలకు ఎందుకు భయపడాల్సి వస్తోందన్న ప్రశ్నకు సమాజం సమాధానం వెతకాలని అన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్న సందర్భాల్లో మహిళల స్వేచ్ఛ, భద్రతపై దాడులు పెరుగుతున్నాయని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను పురుషుల ఆధీనంలో ఉంచాలనే పితృస్వామ్య భావజాలాన్ని అధిగమించాలని, మనుస్మృతిలోని మహిళల స్వతంత్రతను పరిమితం చేసే భావనలకు బదులుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ సూత్రాలే సమాజానికి మార్గదర్శకాలని స్పష్టం చేశారు.మహిళలు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రమే కోరుతున్నారని సీతక్క అన్నారు.

గ్రామాల్లో పనిచేసే మహిళ నుంచి ఉద్యమాల్లో పాల్గొనే మహిళ వరకు, వీధుల్లో వార్తలు సేకరించే మహిళా జర్నలిస్టు వరకు ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం దక్కాలని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి కొలమానం కాదని, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజలకు వాస్తవాలను అందించే స్వతంత్ర మీడియా కూడా ప్రజాస్వామ్యానికి కీలకమని అన్నారు.మహాత్మా గాంధీ జర్నలిజంలో సత్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారని గుర్తుచేసిన మంత్రి, వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందుంచడమే జర్నలిజం ప్రధాన బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం బలంగా మనుగడ సాగించలేదని అన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు వారి సామాజిక, రాజకీయ స్వేచ్ఛకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సీతక్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను కేవలం ఆదాయం సంపాదించే స్థాయిలోనే కాకుండా ఆస్తులు కలిగినవారిగా, వ్యాపార సంస్థల యజమానులుగా, నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మహిళ సాధికారత అంటే ఆర్థికంగా సంపాదించడం మాత్రమే కాదని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే సామర్థ్యం, తన అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉండాలని అన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం, విద్య, రాజకీయ భాగస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టుల భద్రత, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీతక్క సూచించారు. వృత్తిపరమైన అనుబంధాలు, సిద్ధాంతపరమైన భేదాలు ఎలా ఉన్నా మహిళల గౌరవానికి, భద్రతకు ముప్పు ఎదురైనప్పుడు మహిళా జర్నలిస్టులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏ మహిళా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, ప్రశ్నించడానికి భయపడాల్సిన పరిస్థితులు లేని సమాజాన్ని నిర్మించడమే మనందరి లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాధా రాణి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ అయిషా కనుమ్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, జర్నలిస్టు ఉద్యమ నేతలు దేవులపల్లి అమర్, విరాహత్ అలీ, రాo నారాయణ, సోమసుందర్, అరుణ తదితరులు పాల్గొన్నారు.