ఎల్నినో ప్రభావాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
– ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలకు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
రాయపర్తి అక్షిత ప్రతినిది
ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త లచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, నెక్కొండ మండలాల్లోని పలు గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ, పర్వతగిరి మండలం సోమారం గ్రామపంచాయతీ, సంగెం మండలం తీగరాజుపల్లి, సోమ్లాతండా గ్రామపంచాయతీలు, నెక్కొండ మండలం పత్తిపాక గ్రామపంచాయతీల్లో చేపట్టిన ఫామ్ పాండ్ పనులు, గ్రామ సంఘాల భవనాలు, సాగునీటి చెరువుల పనులను కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వరికి బదులు మొక్కజొన్న,కందులు ,మినుములు, సన్ ఫ్లవర్ , తదితర నూనె గింజలు పంటలు పండించాలని సూచించారు. ఈ సందర్భంగా పనుల వద్ద ఉన్న ఉపాధి కూలీలతో మాట్లాడి, పనుల పురోగతి, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ పర్యటనలో డీఆర్డీవో నాగ పద్మజ, జడ్పీ సీఈవో వసంత, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.