*అడ్డుపడితే ఎక్కించేస్తాం!

*అడ్డుపడితే ఎక్కించేస్తాం!*
*- ఇసుక మాఫియా హుకుం*
*- సంపదను తోడేస్తున్నారు*
*- దర్జాగా దోచుకుంటున్నారు*
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి:

మా దందాకు అడ్డుపడితే..మీదకు ఎక్కించేస్తామని ఇసుక మాఫియా సిండికేట్ హుకుం జారీ చేయడం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పగలు రాత్రి సమయాల్లో ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ల యజమానులు వివిధ వాగుల నుండి ఇసుకను తరలించడం జరుగుతుంది. ఇసుక లోడ్ తో పోతున్న ట్రాక్టర్లకు ఎవరైనా అడ్డుపడితే వారి మీదికి ఎక్కించడం జరుగుతుంది. తాజాగా ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అనిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ వాగు నుండి దొంగచాటుగా ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తుండగా సమీపంలో ఉన్న గ్రామస్తులు ఒక విలేఖరికి సమాచారం అందించారు. వెంటనే విలేఖరి ట్రాక్టర్ దగ్గరికి వెళ్లి అనుమతులు ఉన్నాయని ప్రశ్నిస్తుండగా డ్రైవర్ సమాధానం చెప్పకుండానే తన ట్రాక్టర్ తో విలేకరిని తీవ్ర గాయపరచడం జరిగింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం మారిన విషయం పాఠకులకు విధితమే. అంతేకాకుండా గతంలో సైతం కొందరు ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడితే వారిని సైతం గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం పరిధిలోని ముర్రేడు వాగు నుండి ఇసుక సంపదను ట్రాక్టర్ల యజమానులు దోచుకుంటున్నారు.

ఈ దందా వెనుక కొందరు టిఆర్ఎస్ నాయకుల, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండానే ఇసుకతోలకాలు జరపడం వల్ల ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయి. అంతేకాకుండా వర్షాకాలం సమయంలో గోతుల్లో వరద నీరు చేరి పక్కనే ఉన్న పంట భూముల భూమి సైడ్ లను కోసి వేయడం జరుగుతుంది. ఇప్పటికే కొందరు రైతుల భూమి పూర్తిగా కొట్టుకుపోయింది. ఇందుకు కారణం ఇసుకను తరలించడమేనని ప్రజా సంఘాల నాయకులు అన్నదాతలు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం..*
ముర్రేడు వాగుతో పాటు ఇతర వాగులలో ఇసుక మాఫియా ఇసుక సంపదను తోడేస్తున్న విషయాన్ని కొందరు పలుమార్లు రెవెన్యూ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇసుక సంపదను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నప్పటికీ అధికారులలో చలనం లేకపోవడం దారుణమని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక మాఫియా దందాకు చెక్ పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking