*అర్హులకు సంక్షేమ ఫలాలు*
*430 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ…*
*ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్*
లోకేశ్వరం,నవంబర్ 26, అక్షిత న్యూస్ :
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ అన్నారు.గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 430 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ముధోల్ నియోజకవర్గానికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రేషన్ కార్డుల పంపిణీతోపాటు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, విద్య, వైద్యం, సాగునీటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…