వేల భావాలు.. ఒక్క ఫొటో!

చిత్రమే… చరిత్ర!!

వార్తల కన్నా ఫొటోలోనే ఆకర్షణ శక్తి ఎక్కువ

శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వేల భావాలకు సజీవ సాక్ష్యం.. ఫోటో. చిత్రమే చరిత్ర. పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తల కన్నా, ఫొటోలోనే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుందని, ఫోటో క్షణాల్లోనే వేల భావాలను ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లగలగుతుందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

శనివారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.


చదివిన వార్తను పాఠకులు మరిచిపోవచ్చు కానీ మనసును కదిలించే ఫోటో మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుందని స్పీకర్ తెలిపారు. అందుకే ఫోటో అంటే కేవలం దృశ్యం మాత్రమే కాదని, అది ఒక చరిత్ర అని ఆయన స్పష్టం చేసారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య ఉద్యమాల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి యుద్ధాల వరకు, పేదరికం నుంచి సామాజిక వివక్ష వరకు.. ప్రపంచ చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను మన కళ్ల ముందు నిలిపింది ఫోటో జర్నలిజమేనని ప్రసాద్ కుమార్ కొనియాడారు. ఒక పేద తల్లి కన్నీటిని, ఆకలితో అలమటిస్తున్న చిన్నారి పరిస్థితిని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల ఆవేదనను, ప్రజల కోసం పోరాడుతున్న ఉద్యమకారుల తెగువను ప్రపంచానికి పరిచయం చేసేది ఫోటో జర్నలిస్టు కెమెరానే అని ఆయన అన్నారు. ఒక ఫోటో ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తుందని,
ఒక ఫోటో అధికార వ్యవస్థను ప్రశ్నిస్తుందని, ఒక ఫోటో ప్రజా ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తుందని, ఒక ఫోటో సమాజంలో మార్పుకు నాంది కావచ్చని ఆయన అన్నారు.


అందుకే ఫోటో జర్నలిస్టు కెమెరా ఎప్పుడూ నిజం వైపు గురిపెట్టాలని, వారి ఆలోచన ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని, వృత్తి నిబద్ధత ఎప్పుడూ జర్నలిజం విలువలను కాపాడాలని స్పీకర్ కోరారు. ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఫోటో జర్నలిజంలో అనేక మార్పులు తీసుకువచ్చిందని, క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫోటోను చేరవేయగలుగుతున్న ఒక గొప్ప అవకాశం ఏర్పడడం మంచి పరిణామమే అయినప్పటికీ, ఇది ఒక పెద్ద సవాలు కూడా అని ఆయన అన్నారు. మార్ఫింగ్, ఫేక్ ఫోటోలు, ఏఐ సృష్టించిన దృశ్యాలు, తప్పుడు సమాచారంతో కూడిన చిత్రాలు సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఫోటో జర్నలిస్టులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఫోటో జర్నలిస్టులు వృత్తి నైతికతను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, ఫోటో జర్నలిస్టు మీడియా సంస్థలో ఉద్యోగి మాత్రమే కాదని, అతను కాలానికి సాక్షి, చరిత్రలో సైనికుడని అభివర్ణించారు.సమాజంలో సంఘర్షణతో కూడుకున్న వృత్తుల్లో ఫోటో జర్నలిజం ఒకటని ఆయన అన్నారు. అసలే కత్తిమీద సాములాంటి జర్నలిజం వృత్తిలో ఫోటో జర్నలిస్టుల కష్టాలు వర్ణనాతీతమన్నారు. విధినిర్వహణలో కష్టాలు, కుటుంబ పోషణలో కష్టాలను ఫోటో జర్నలిస్టులు అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఫోటో జర్నలిస్టులకు తమ సంఘం అండగా నిలబడి, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నట్లు విరాహత్ అలీ అన్నారు.
ఇంకా ఈ సభలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ఫోటో జర్నలిస్టులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సత్కరించి, అవార్డులు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking