శత వసంతాల చదువుల చుక్కాని

శత వసంతాల
     చదువుల చుక్కాని

తరాలకు స్ఫూర్తి
చుక్కా రామయ్య

వందేళ్ల జ్ఞాన వికాసం

చుక్కా రామయ్యకు
 సమకాలికులు లేరు

పుట్టినరోజు వేళ
సీఎం రేవంత్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య శత జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు ఒక గొప్ప పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప విద్యావేత్తగా, సామాజిక పరివర్తన తీసుకువచ్చిన మహనీయుడిగా చుక్కా రామయ్య వందేళ్లు పూర్తి చేసుకోవడం ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాల్సిన సందర్భమని పేర్కొన్నారు.

ఉద్యమాల చరిత్ర.. ‘ఐఐటీ’ పరిచయం
స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో చుక్కా రామయ్య పాల్గొన్న చరిత్ర ఎంతో గొప్పదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు ఐఐటీ అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలి సభ్యుడిగా కూడా ఈ ప్రాంతంపై ఆయన తనదైన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఈ విషయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటానని తెలిపారు. సామాజిక సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై పదునైన ప్రశ్నల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, వాటికి పరిష్కారం ఏ విధంగా ఉండాలో కూడా ఆయన సూచించేవారని రేవంత్ రెడ్డి వివరించారు.రాజకీయ నాయకులు ఉత్తుత్తి, ఉద్వేగ ఉపన్యాసాలు కాకుండా సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలని, సమస్యలను ప్రస్తావించడంతో పాటు పరిష్కార మార్గాలు చూపే కొద్దిమందిలో చుక్కా రామయ్య ఒకరని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. చట్టసభల్లో పార్టీ బలంతో నిమిత్తం లేకుండా చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారికి మాట్లాడటానికి సమయం ఇచ్చేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేని విషయాన్ని అప్పట్లో వారు మండలిలో ప్రస్తావించేంత వరకు ఎవరికీ తెలియదని, వారి ప్రస్తావన తర్వాతే ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


కాలం, రాజకీయాలకు అతీతులు
పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి గొప్ప వ్యక్తులు తమ ప్రాంతంలో ఉన్నారని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ చెప్పుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీరు కాలానికి, రాజకీయాలకు అతీతులని, ప్రజల పట్ల వారికి ఉన్న అంకితభావం, చిత్తశుద్ధి వల్ల కొంతమంది విషయంలో రాజకీయ నాయకులంతా ఏకాభిప్రాయంతో ఉంటారని అన్నారు. తెలంగాణలో చుక్కా రామయ్యకు సమకాలికులు లేరని, ఆయన అతీతుడని అభివర్ణించారు. చుక్కా రామయ్య ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆయన మరింత ఆరోగ్యంతో ఉండి అందరికీ స్ఫూర్తి ఇవ్వాలని ఆకాంక్షిస్తూ రేవంత్ రెడ్డి ఆయనకు వంద వసంతాల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking