సిద్దిపేట గడ్డ..
ఇక కాంగ్రెస్ అడ్డ!
గులాబీ గడ్డపై
హస్తం జెండా!!
సిద్దిపేటలో కాంగ్రెస్
సమరశంఖం
ఇక సిద్దిపేటలో
హస్తం హవా
గులాబీ కోటకు
కాంగ్రెస్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట, అక్షిత బ్యూరో :
ఇక నుంచి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని పార్టీ కార్యకర్తలు నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన రూ.565 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం దాదాపు 2 కిలోమీటర్ల మేర పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్మోహన్ పేరు సిద్దిపేట అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రూ.550 కోట్ల నిధులను కేటాయించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, సిద్దిపేట గడ్డ నుంచే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన మదన్మోహన్ను ఈ సందర్భంగా అందరూ స్మరించుకోవాలని అన్నారు. ఆయన పేరు వినబడకుండా చేయాలని కేసీఆర్, హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సీఎం.. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్మోహన్ పేరు పెడుతూ త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు. రాజకీయ జీవితం ఇచ్చిన మదన్మోహన్పైనే ఆనాడు కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేశారని, నమ్మినవారిని మోసం చేయడం ఆయనకు ఆనాటి నుంచే అలవాటని రేవంత్ రెడ్డి విమర్శించారు.

హరీశ్ రావు, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ప్రశ్నలు
2004లో వార్డు మెంబర్‌గా కూడా గెలవని హరీశ్ రావుకు పొత్తులో భాగంగా వైఎస్ఆర్ మంత్రి పదవి ఇస్తే, ఆ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్ర చేశారని సీఎం ఆరోపించారు. హరీశ్ రావును కంటికిరెప్పలా కాపాడిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి నేడు సొంత కారు కూడా లేదని, చెరుకు ముత్యం రెడ్డి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలని అన్నారు. కానీ హరీశ్ రావు ఫ్యామిలీకి రూ.వేల కోట్ల ఆస్తులు, రంగనాయక్ సాగర్ వద్ద, కొండపోచమ్మ సాగర్ వద్ద కేసీఆర్, హరీశ్ రావులకు వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ కోసం శ్రీకాంత్ చారీ ప్రాణత్యాగం చేస్తే, కేసీఆర్ మాత్రం తన కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకుకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. 2018లో గెలిచాక ప్రాజెక్టులలో దోపిడీకి పాల్పడినందుకే హరీశ్ రావుకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

సాగునీటి ప్రాజెక్టులు, నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పన్నుల రూపంలో వచ్చిన రూ.20 లక్షల కోట్లు, ప్రాజెక్టుల పేరిట చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ రావు ముందుండి కట్టించిన రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని, ఆ దోపిడీతోనే వేల ఎకరాలు సంపాదించుకున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టి, ఏపీ సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 10 వేల క్యూసెక్కుల నుంచి రోజుకు 8 టీఎంసీలకు పెరుగుతుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని, పాలమూరు ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టారని విమర్శించారు. చివరకు బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్ తీరుపై విమర్శలు
మూడేళ్లుగా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ రూ.కోటిన్నర జీతం తీసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీకి వస్తే నీళ్లు, భూములు, లిక్కర్ దోపిడీని బయటపెడతానని సవాల్ విసిరారు. సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక దోపిడీకి కేటీఆర్, సంతోష్ రావు పాల్పడ్డారని ఆరోపించారు. సొంత చెల్లిని పట్టించుకోని, పార్టీ నుంచి గెంటేసిన కేటీఆర్.. రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.తమ ప్రభుత్వం గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి అదనంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. 2029 ఎన్నికల్లోనూ గెలిచి 2034 వరకు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్, సిద్దిపేట గడ్డలపైనా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, సిద్దిపేట ప్రజలు కోరిన నాయకుడికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, గెలిపించుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.