31 గుంటల భూమి కబ్జా!
రైతు భూమిపై మిల్లు
యజమానుల కన్ను!!
కొనుగోలు చేసింది
ఆరెకరాలు.. కబ్జాలో ఏడెకరాలు
*వ్యవసాయ భూమి కబ్జా చేశారంటూ రైతు ఆవేదన*
న్యాయం చేయాలని అధికారులకు బాధిత రైతు ప్రదక్షిణలు
పెద్దఅడిశర్లపల్లి, అక్షిత ప్రతినిధి:
తన వ్యవసాయ భూమిని రైస్ మిల్లు యజమానులు ఆక్రమించి సాగులో కొనసాగుతున్నారని పెద్ద అడిశర్లపల్లి గ్రామానికి చెందిన రైతు దారం పరమేశ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా రైతు పరమేశ మాట్లాడుతూ.. పీఏ పల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 815లో మొత్తం 14 ఎకరాల 21 గుంటల భూమి తన మామ బొలుగొర్ల కోటయ్య పేరిట ఉండేదని, ఆయనకు తాను ఒక్కగానొక్క కుమార్తెనని తెలిపారు. వివిధ సందర్భాల్లో కొంత భూమిని విక్రయించగా, రైస్ మిల్లు యజమానులు కొనుగోలు చేసిన భూమితో కలిపి మొత్తం ఆరు ఎకరాల 10 గుంటలు వారి ఆధీనంలో ఉండాల్సి ఉందన్నారు.అయితే అదనంగా మరో 31 గుంటల భూమిని ఆక్రమించి మొత్తం ఏడెకరాల ఒక గుంట భూమిలో కాస్తులో కొనసాగుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు మిల్లు యజమానుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని, ప్రభుత్వ సర్వేయర్లను పిలిపించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీశైలం కాలువ నిర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 815లోని భూమితో పాటు రైస్ మిల్లు ప్రాంతం కూడా ముంపునకు గురైందని, ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తూ అవార్డు కాపీలు జారీ చేసిందన్నారు. తన పేరిట ఆరు ఎకరాల 31 గుంటల భూమి ఉన్నట్లు అవార్డు కాపీలో నమోదైందని, అయితే తాను ఇప్పటికే ఆరు ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం పొందానని తెలిపారు. మిగిలిన 31 గుంటలకు సంబంధించిన నష్టపరిహారం రావాల్సి ఉందన్నారు.

మిగిలిన భూమికి నష్టపరిహారం ఇప్పిస్తానని చెబుతూ, ఆ భూమిని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలనే ఉద్దేశంతో మిల్లు యజమానులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి భూమిని సర్వే చేసి, వాస్తవ హక్కులను నిర్ధారించి తనకు న్యాయం చేయాలని రైతు దారం పరమేశ విజ్ఞప్తి చేశారు.