*సింగరేణి భూమిపై అక్రమ విక్రయాల ప్రచారం!*
*హెచ్చరిక బోర్డు ఉన్నా ఆగని భూదందా ఆరోపణలు.*
*800 గజాల స్థలంపై వివాదం!*
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత న్యూస్ :
కొత్తగూడెం పట్టణంలో సింగరేణి సంస్థకు చెందిన భూముల పరిరక్షణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని ఎల్ఐసీ ఆఫీస్ రోడ్డులో, హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న సుమారు 800 గజాల స్థలంపై అక్రమ ఆక్రమణలు, విక్రయాల ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ స్థలం విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
*హెచ్చరిక బోర్డు బేఖాతర్!*
సదరు స్థలంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సిసిఎల్) యాజమాన్యం పేరుతో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూమి సింగరేణికి చెందినదని, అనుమతి లేకుండా ప్రవేశించినా, ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులో స్పష్టంగా పేర్కొన్నారు.అయినప్పటికీ ఈ భూమిపై వివాదం కొనసాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

*వ్యక్తిగత ఆధీనంలోకి తీసుకుని విక్రయించారా?*
ఈ స్థలాన్ని ఓ వ్యక్తి తన ఆధీనంలోకి తీసుకుని, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో పాటు మరో వ్యక్తికి విక్రయించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విక్రయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. నిజంగానే సింగరేణి యాజమాన్యంలోని భూమిని ప్రైవేటు వ్యక్తులు విక్రయించే ప్రయత్నం చేశారా? అలా జరిగితే కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన పత్రాలు ఏమిటి? ఈ లావాదేవీల వెనుక ఉన్నది ఎవరు? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి.
*సింగరేణి అధికారుల స్పందన ఏది?*
కోట్లాది రూపాయల విలువైన సంస్థ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉంది.హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కూడా భూమిపై ఆక్రమణలు, అక్రమ విక్రయాల ప్రచారం వినిపిస్తుండటంతో సంబంధిత అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సదరు స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లు, రెవెన్యూ రికార్డులు, సింగరేణి యాజమాన్య హక్కులు, ప్రస్తుత భౌతిక పరిస్థితులపై ల్యాండ్ విభాగం అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ అక్రమ ఆక్రమణలు లేదా విక్రయ ప్రయత్నాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కోట్ల విలువైన సింగరేణి భూమికి రక్షణ కరువైందా? హెచ్చరిక బోర్డు కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుందా. అక్రమ విక్రయాల ప్రచారంపై సింగరేణి ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? అన్నది ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.