పోలీసుల్లో క్రీడా స్ఫూర్తికి ప్రోత్సాహం!
– 5వ తెలంగాణ పోలీస్ క్రీడా పోటీలకు సన్నద్ధం.. నిర్మల్,భైంసా పోలీసులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ..
– క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి
– జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ …
నిర్మల్,నవంబర్ 17అక్షిత ప్రతినిధి :
పోలీసు సిబ్బందిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు జట్టు స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెలలో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో పాల్గొనేందుకు నిర్మల్, భైంసా డివిజన్ల పోలీసు సిబ్బందిని సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బాసర జోన్ పరిధిలోని నిర్మల్, భైంసా డివిజన్ల పోలీసు సిబ్బందికి నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లా డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా వివిధ క్రీడలకు సంబంధించిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, మాట్లాడుతూ.. పోలీసు విధులతో పాటు క్రీడల్లోనూ సిబ్బంది ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టు సమన్వయాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాబోయే రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, జిల్లా డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, భైంసా, నిర్మల్ డివిజన్ల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు…