నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు
మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ హెచ్చరిక
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరాలకు సరిపడా నీటిని మాత్రమే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయరాదని కోరారు.పట్టణంలోని సూపర్ బజార్, రైల్వే స్టేషన్, బి-జోన్ సెంటర్, రాజీవ్ చౌక్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుల వద్ద కొందరు వ్యాపారులు నీటిని వృథా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ఎవరైనా నీటిని వృథా చేసినట్లు గుర్తిస్తే మున్సిపాలిటీ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటిని వృథా చేసే వారి వివరాలను వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు.