నల్లమల్ల ముద్దుబిడ్డకు సీఐగా పదోన్నతి*
అంకిరోనీపల్లి గ్రామానికి చెందిన వడ్త్యా రాములుకు అరుదైన గౌరవం
నాగర్‌కర్నూల్, అక్షిత ప్రతినిధి :
నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారి తన కష్టానికి, అంకితభావానికి తగిన గుర్తింపు పొందారు. అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం అంకిరోనీపల్లి గ్రామానికి చెందిన వడ్త్యా రాములు (తండ్రి బిచ్చ నాయక్) ఎస్సై స్థాయి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదోన్నతి పొందారు. సోమవారం ఉన్నతాధికారులు పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు.వడ్త్యా రాములు పోలీసు శాఖలో గత 20 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో సేవలందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత బీచుపల్లి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన, తన సేవానిరతితో క్రమంగా హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) హోదాలకు ఎదిగారు. ప్రస్తుతం కొండాపూర్ బెటాలియన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు తాజాగా సీఐగా పదోన్నతి లభించింది.సామాన్య గ్రామీణ కుటుంబం నుంచి పోలీసు శాఖలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవడం అంకిరోనీపల్లి గ్రామంతో పాటు నల్లమల్ల ప్రాంత ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఆయన సాధించిన ఈ ప్రగతి యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఐగా పదోన్నతి పొందిన సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు రాములుకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.