ఆగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్
ఈ నెల 25 నుంచి బాండ్ల ధృవీకరణ
మంచిర్యాల జిల్లా బాధితులకు నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కేంద్రం
మండలాల వారీగా షెడ్యూల్ విడుదల
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఆగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు ఊరట కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఆధ్వర్యంలో బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పది ప్రత్యేక కేంద్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బాధితులు, డిపాజిటర్లు, నామినీలు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు తమ వద్ద ఉన్న అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదులతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా బాధితుల కోసం నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన బాధితులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ధృవీకరణకు సంబంధించిన వివరాల కోసం వై. కృష్ణారెడ్డి, ఐఓపీ, సీసీఎస్ (ఫోన్: 8179163403)ను సంప్రదించవచ్చు.
తీసుకురావాల్సిన పత్రాలు:
డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రసీదు, బాండ్‌పై సంతకం చేసిన కలర్ జిరాక్స్ ప్రతి, ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ ప్రతులు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటో, డిపాజిటర్ మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్, ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ (తెలిస్తే) తీసుకురావాలి. డిపాజిటర్ మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలు సమర్పించాలి.
అసలు బాండ్‌ను కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. బాండ్ కలర్ జిరాక్స్ ప్రతిపై డిపాజిటర్ లేదా నామినీ లేదా చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి. బ్యాంకు ఖాతాదారుని పేరు, ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ స్పష్టంగా కనిపించేలా పత్రాలు ఉండాలి. సమర్పించిన పత్రాలకు రసీదు అందజేస్తారు. ధృవీకరణ ప్రక్రియ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే బాధితులు కేంద్రానికి హాజరుకావాలి.
మంచిర్యాల జిల్లా మండలాల వారీ షెడ్యూల్ ఇలా..
జనవరి 28న బెల్లంపల్లి (250 మంది), జనవరి 29న బెల్లంపల్లి (197), భీమారం (53), జనవరి 30న భీమారం (199), భీమిని (51), ఫిబ్రవరి 1న భీమిని (250), ఫిబ్రవరి 2న భీమిని (33), చెన్నూరు (217), ఫిబ్రవరి 3న చెన్నూరు (154), దండేపల్లి (96), ఫిబ్రవరి 4న దండేపల్లి (250), ఫిబ్రవరి 5న దండేపల్లి (36), హాజీపూర్ (214), ఫిబ్రవరి 6న హాజీపూర్ (33), జైపూర్ (217), ఫిబ్రవరి 8న జైపూర్ (208), జన్నారం (42), ఫిబ్రవరి 9న జన్నారం (250), ఫిబ్రవరి 10న జన్నారం (66), కన్నెపల్లి (184), ఫిబ్రవరి 11న కన్నెపల్లి (202), కాసిపేట (48), ఫిబ్రవరి 12న కాసిపేట (250), ఫిబ్రవరి 15న కాసిపేట (41), కోటపల్లి (209), ఫిబ్రవరి 16న కోటపల్లి (46), లక్షెట్టిపేట (204), ఫిబ్రవరి 17న లక్షెట్టిపేట (104), మంచిర్యాల (146), ఫిబ్రవరి 18న మంచిర్యాల (204), మందమర్రి (46), ఫిబ్రవరి 19, 20, 22 తేదీల్లో మందమర్రి మండలానికి చెందిన 250 మంది చొప్పున, ఫిబ్రవరి 23న మందమర్రి (7), నస్పూర్ (243), ఫిబ్రవరి 24న నస్పూర్ (154), నెన్నెల (96), ఫిబ్రవరి 25న నెన్నెల (157), తాండూర్ (93), ఫిబ్రవరి 26న తాండూర్ (196), వేమనపల్లి (54), ఫిబ్రవరి 27న వేమనపల్లి (223), ఖానాపూర్ (27), మార్చి 1న ఖానాపూర్ (222), లోకేశ్వరం (28) మంది బాధితులకు ధృవీకరణ నిర్వహించనున్నారు.
నిర్ణీత తేదీ, కేటాయించిన సంఖ్యకు అనుగుణంగా సంబంధిత మండలాల బాధితులు నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రానికి అవసరమైన అన్ని పత్రాలతో హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ కోరింది. ధృవీకరణకు వెళ్లే ముందు సంబంధిత అధికారుల వద్ద తేదీలు, షెడ్యూల్‌ను మరోసారి నిర్ధారించుకోవాలని సూచించింది. ఈ అవకాశాన్ని బాధితులందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.