ప్రభుత్వ అధికారుల పనితీరుపై సర్వే
ఈ సారి కొత్తగా రాజకీయనాయకుల అవినీతిపై రెండు తెలుగు రాష్ట్రాలలో నెలరోజులు సర్వే
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిర్వహణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
సమాజంలో అవినీతి నిర్మూలన కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ గత పది సంవత్సరాలుగా పనిచేస్తోంది. వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకుపోతుంది. అవినీతిని ప్రశ్నించడమే కాకుండా నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను, నాయకులను గుర్తించి వారిని సత్కరిస్తూ నేటి సమాజానికి పరిచయం చేస్తోంది.
అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారుల పనితీరు, సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వెళితే అధికారుల ప్రవర్తనతో పాటు ఇతర అంశాలపై సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ప్రారంభ ప్రకటనను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ రాజేంద్ర పల్నాటి ప్రారంభించారు.
అనంతరం ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో అవినీతి నిర్మూలనకోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు వినూత్నంగా, సమాజంలో మంచి మార్పుకోసం దోహదం చేసేలా ఉన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారుల పనితీరు, వారి ప్రవర్తన, అధికారుల్లో అవినీతిపై సర్వే నిర్వహించడం మంచి అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు సర్వే నిర్వహించి సర్వే రిపోర్టును విడుదల చేసి అనంతరం ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఏఏ శాఖలలో ఎంత అవినీతి ఉంది. అధికారుల పనితీరు, ప్రవర్తనపై కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారుల పనితీరు, అవినీతిపై సర్వే చేశామన్నారు. 20 వేలకు పైగా ప్రజలను సర్వేలో భాగస్వామ్యులను చేశామని తెలిపారు. ఈ సారి అధికారుల పనితీరుపైనే కాకుండా ఎమ్మెల్యెల పనితీరు, అభివృద్ది, అవినీతి అంశాలపై కూడా సర్వే చేస్తున్నట్లు వారు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వే నెల రోజుల పాటు కొనసాగుతుందని, అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యులను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రతినిధులు కానుగంటి రాజు, కొన్నె దేవేందర్, కొమటి రమేశ్ బాబు, బత్తిని రాజేశ్, స్వప్నారెడ్డి, శ్రీజ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.