అనుమానిత వ్యక్తుల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్
రాయపర్తి అక్షిత ప్రతినిధి
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనుమానిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ కోరారు. గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని చెబుతూ కొందరు కొత్త వ్యక్తులు మండలంలో సంచరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతున్నదన్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఫోటో అప్లోడ్ చేయాలని, మెడలో ఉన్న బంగారు ఆభరణాలను పక్కన పెట్టాలని, బంగారం ఉంటే ఉచితంగా గ్యాస్ ఇవ్వబోరని చెప్పి ప్రజలను మోసం చేసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అందువల్ల గ్యాస్ ఈ-కేవైసీ, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి రుణాలు, క్రాప్ లోన్లు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని గ్రామాలకు వచ్చే అనుమానిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై ముత్యం రాజేందర్ కోరారు.