ఎల్‌టీఆర్‌ కేసుల్లో అధికారుల ‘’మాయ’’!

*ఎల్‌టీఆర్‌ కేసుల్లో
అధికారుల ‘’మాయ’’!*

90 ఎకరాల వివాదం.. ఐదు కేసులుగా విచారణనా?

18 ఎకరాలకే తీర్పు.. మిగతా 72 ఎకరాలపై మౌనం?

1980లలో వలస వచ్చిన గిరిజనేతరులకు 1970 ముందే ఉన్నట్లు పుట్టుకొచ్చిన సాక్ష్యాలపై గిరిజనుల ఆశ్చర్యం!

బోడు గ్రామంలో బహుళ అంతస్తుల అక్రమ భవన నిర్మాణంపై ఆదేశాలు వెలువడినా చర్యలు శూన్యం

ఐటీడీఏ కోర్టును ఆశ్రయించనున్న గిరిజన బాధితులు.

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత బ్యూరో:

గిరిజన ప్రాంతాల్లోని భూములను రక్షించాల్సిన ఏజెన్సీ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన, ప్రభుత్వ రికార్డుల వెరిఫికేషన్ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన గిరిజన బాధితులు. రెస్పాండెంట్లు సమర్పించిన ప్రైవేట్ కాగితాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వివాదాస్పద ఎల్టీఆర్ కేసులో ఇచ్చిన తీర్పులపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద ఎత్తున లోపాయికారీ వ్యూహం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వలసదారులకు స్థానిక హక్కులా? ఆర్డీఓ తీర్పుపై గిరిజనుల విస్మయం

సదరు గిరిజనేతరులు 1980ల ప్రాంతంలో గుంటూరు జిల్లా నుండి ఇక్కడికి వలస వచ్చారని వృద్ధుడైన పిటిషనర్ పూనెం పాపయ్య , స్థానిక గిరిజనులు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా ఉంటే, ఆర్డీఓ తీర్పు మాత్రం సదరు గిరిజనేతరులే అక్కడి స్థానిక గిరిజనుల కంటే ముందే (1970 కంటే ముందే) ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొనడం గిరిజనులను తీవ్ర ఆశ్చర్యానికి మరియు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పహనిలలో సదరు గిరిజనేతరుల పేర్లు ఇరికించిన విషయం రెవెన్యూ రికార్డులు చూస్తే అర్ధం అవుతుందని, రికార్డుల ట్యాంపరింగ్ జరిగినా ఆ విషయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదని ఫిర్యాదు దారులు చెబుతున్నారు. తాము ఇచ్చిన ఆధారాలు పక్కన బెట్టి వలస వచ్చిన వారికి భూములపై సర్వాధికారాలు కట్టబెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటో అధికారులకే తెలియాలని బాధితులు ఆరోపిస్తున్నారు.

90 ఎకరాల భారీ కేసును 5 ముక్కలుగా చేసిన ఆర్టివో

టేకులపల్లి మండలం కొప్పురాయి రెవెన్యూ గ్రామంలో సుమారు 10 మంది గిరిజనేతరులు అక్రమంగా పట్టాలు పొంది అనుభవిస్తున్న మొత్తం 90.20 ఎకరాల భారీ గిరిజన భూమిపై బాధితులు ఎల్‌టీఆర్ కేసు వేశారు. ఈ కేసులో కేవలం రెండు కుటుంబాలకు చెందిన వారే ప్రతివాదులు గా ఉన్నారు. అయితే, ఇంత పెద్ద భూ కుంభకోణం కేసును ఆర్డీఓ ఒకే కేసుగా లేదా రెండు కుటుంబాలకు చెందినవారు కాబట్టి రెండు కేసులుగా విచారించకుండా 5 కేసులుగా విడదీసి విచారించడం అనేక అనుమానాలకు తావిస్తోందనీ కేసు యొక్క తీవ్రతను తగ్గించడానికి, కాలయాపన చేయడానికి గిరిజనుల పోరాట బలాన్ని విచ్ఛిన్నం చేయడానికే అధికారులు ఈ వ్యూహం పన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 18 ఎకరాలకు మాత్రమే తీర్పు ఇచ్చి మిగతా 72ఎకరాల విషయంలో మౌనం వహించడం ఎల్టీఆర్ చట్టాన్ని పరిహసించడమే అని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్‌టీఐ వేస్తే గానీ కదలని ఫైల్.. గిరిజనులపై అధికారుల వివక్ష

ఈ కేసు తీర్పు కాపీలను రెస్పాండెంట్లకు (ఎదురుపక్షానికి) అధికారులు ముందే అందజేశారు. కానీ గిరిజన బాధితులు ఆఫీసుకు వెళ్లి అడిగితే కేసు క్లోజ్ అయిందని అని ముక్తసరిగా చెబుతూ తీర్పు కాపీలు ఇవ్వడానికి రెండు నెలలుగా సతాయిస్తూ వచ్చారు. ఇదేమిటని అడిగితే మీరే వచ్చి తీసుకోవాలి మేమెలా పంపుతాం అంటూ వితండవాదం చేసిన అధికారులు శనివారం సాయంత్రం వరకు కాలయాపన చేయడంతో విసిగిపోయిన బాధితులు… వెంటనే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. బాధితులు ఆర్‌టీఐ అప్లికేషన్ వేసి ఆఫీస్ వదిలి వెళ్లకపోవడంతో, చేసేదేమీ లేక అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటల తర్వాత ఆ ఒక్క తీర్పు కాపీని బాధితులకు అందజేశారు. మిగతా నాలుగు కేసుల తీర్పులు రికార్డ్ గదిలో దొరకడం లేదు, గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ బాల్య నాయక్ ను అడగండి అని చెబుతున్నారని తెలిపారు.

బోడులో బహుళ
అంతస్తుల భవనంపై ఆదేశాలు జారీ

ఇంకా అందలేదంటున్న తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి*

ఇదే వ్యవహారంలో మరో ఎల్టీఆర్ కేసు వివరాలు కూడా బాధితులు బయటపెట్టారు. బోడు రెవెన్యూ గ్రామంలోని మరొక గిరిజనేతరుడిపై కూడా ఎల్టీఆర్ కేసు నమోదైంది. అతడు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఒక మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఇక్కడ స్పష్టంగా ఎల్‌టీఆర్ చట్టం వర్తిస్తున్నప్పటికీ, ఆర్డీఓ తన తీర్పులో మాత్రం ఆ నిర్మాణానికి ఎలాంటి పంచాయతీ అనుమతులు లేవని, అలాగే అది గతంలో ప్రభుత్వ భూమి  కాబట్టి దానిపై ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ (భూ ఆక్రమణ) చట్టం కింద తక్షణమే చర్యలు తీసుకోవాలని టేకులపల్లి తహసీల్దార్‌కు, పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినట్లు తీర్పులో రాశారు. కాగా ఈ భవనం సాక్షాత్తూ బోడు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రక్కనే నిర్మించాడు. అంతే కాకుండా పంచాయతీ కార్యాలయ భూమిని కూడా కొంతమేర ఆక్రమించినట్లు నిర్మాణాన్ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే ఆ నిర్మాణం చేసిన భూమి పదేళ్ల క్రితం వరకు కూడా బోడు గ్రామానికే చెందిన మరొక గిరిజనేతర కుటుంబం స్వాధీనంలో ఉండగా సదరు వడ్డీ వ్యాపారి దానిని కొనుగోలు చేసినట్లు గ్రామంలో ఎవరిని అడిగినా స్పష్టంగా చెబుతారు. కానీ ఎలాంటి స్థానిక విచారణ లేకుండా ఇలాంటి తీర్పు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందని, అయినా పై కోర్టులో తేల్చుకుంటామని ఆదివాసీ హక్కుల నాయకురాలు మడకం సమ్మక్క అక్షిత ప్రతినిధి కి తెలిపారు.

ఐటీడీఏ కోర్టులో
తేల్చుకుంటాం

గిరిజన బాధితులు

ఈ చట్టపరమైన అన్యాయంపై తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గిరిజన బాధితులు, సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ ఏకపక్ష తీర్పు కాపీలు అధికారుల లీలలన్నింటినీ ఆధారాలతో సహా భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కమ్ అడిషనల్ ఏజెంట్ కోర్టులో అప్పీల్ రూపంలో సమర్పించనున్నట్లు తెలిపారు. ఆర్డీఓ తీర్పు కాపీలో తహసీల్దార్‌కు, పంచాయతీ కార్యదర్శికి అక్రమ భవనంపై చర్యల కోసం ఆదేశాలు పంపినట్లు ఉన్నా… క్షేత్రస్థాయిలో టేకులపల్లి మండల తహసీల్దార్ , పంచాయతీ కార్యదర్శి మాత్రం తమకు అలాంటి ఆదేశాలు అసలు అందనే లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. కోర్టు రికార్డుల్లో ఆదేశాలు ఇచ్చామని రాయడం, కానీ కింద ఉన్న అధికారులకు ఆ కాపీలు చేరకపోవడం, గిరిజనులు ఆర్డీఓ కార్యాలయంలో రోజంతా పడిగాపులు గాచినా తీర్పు కాపీలు ఇవ్వకపోవడంపై దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ ఒరిజినల్ రికార్డులను రికార్డ్ రూమ్ నుండి తెప్పించి, సదరు గిరిజనేతరుల పేర్లు పాత పహనిలలో ఇరికించి రికార్డుల ట్యాపరింగ్ కు పాల్పడిన రెవెన్యూ సిబ్బంది పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking