ప్రజా సమస్యలు పట్టించుకోవట్లే!

భద్రాచలంలో ప్రజా సమస్యలు

పట్టించుకునే నాథుడే లేరు!

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల తీరుపై తెలంగాణ రక్షణ సేన నేత కనగాల చైతన్య విమర్శలు

బూర్గంపాడు రహదారి, పారిశుద్ధ్యం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై నిలదీత

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి

రైతులకు సాగునీరు అందించాలి

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత బ్యూరో :

భద్రాచలం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా వాటి పరిష్కారంపై పాలకులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య విమర్శించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం భద్రాచలంలోని హరిత హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమెనియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించారు.పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన నాయకులు, ఎన్నికల అనంతరం సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భద్రాచలం బ్రిడ్జి పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం, పట్టణంలోని పారిశుద్ధ్య లోపాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించడం లేదన్నారు.భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేస్తామని, ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నామని చెప్పే నాయకులు పట్టణ పారిశుద్ధ్యంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. చిన్నపిల్లలు తిరిగే వీధుల్లో సైతం చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం

పేదల ఎదురుచూపులు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకున్న పేదలకు ఇప్పటికీ సరైన సమాధానం లభించడం లేదని చైతన్య అన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి? అనే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమస్యలు చూపుతూ, మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల విషయంలోనూ పలు నిబంధనల పేరుతో పేదలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు. భద్రాచలంలో ప్రభుత్వ వ్యవస్థ పనిచేస్తోందా? ప్రైవేటు వ్యక్తుల వ్యవస్థ కొనసాగుతోందా? లేక ఎమ్మెల్యే అనుచరుల వ్యవస్థ నడుస్తోందా? అని ఆమె ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే చుట్టూ వస్తున్న ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

బూర్గంపాడు రహదారిపై పాలకుల దృష్టి ఏదీ?

ఆలయ అభివృద్ధి పేరుతో మంత్రులు తరచూ భద్రాచలం పర్యటిస్తున్నప్పటికీ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రి భద్రాచలం వచ్చిన ప్రతిసారీ బూర్గంపాడు రహదారి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మార్గంలో ప్రయాణించే కళాశాల విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం ఆర్టీసీ బస్సుల రూట్లను మార్చి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దుమ్ముగూడెం మండలం నల్లబిల్లి వద్ద జరిగిన ప్రమాద సమయంలో అంబులెన్స్ రాకపోకలకు ఎదురైన ఇబ్బందులు రహదారుల దుస్థితికి నిదర్శనమన్నారు.

*ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి*

భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక వ్యవహారం కొందరి చేతుల్లోకి వెళ్లిందని, స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక కూడా అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్న తీరుపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సాగునీరు లేక రైతుల అవస్థలు

దుమ్ముగూడెం మండలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరతతో పంటలు దెబ్బతింటున్నాయని, రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో పారిశుద్ధ్యం, రహదారులు, పేదలకు ఇళ్ల మంజూరు, ఇసుక అక్రమ రవాణా, రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కనగాల చైతన్య డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking