ఒక్క సీసీ కెమెరా100 మంది పోలీసులతో సమానం

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

కోస్గి సీఐ సైదులు

మద్దూరు, అమర్‌గడ్డలో తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. 144 ఇళ్ల తనిఖీ,79 వాహనాలు సీజ్

అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుల విస్తృత తనిఖీలు

నారాయణపేట, అక్షిత బ్యూరో:

నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కోస్గి సర్కిల్ పరిధిలోని మద్దూర్ టౌన్ అమర్‌గడ్డ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఉదయం 8:30 గంటల వరకు కోస్గి సీఐ సైదులు ఆధ్వర్యంలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 65 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీలో మొత్తం 144 ఇళ్లను తనిఖీ చేసి,అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు, చట్టవిరుద్ధమైన వస్తువులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సరైన ధ్రువపత్రాలు లేని, అనుమానాస్పదంగా ఉన్న మొత్తం 79 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 74 ద్విచక్ర వాహనాలు, 4 త్రిచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనం ఉన్నాయి. అలాగే తనిఖీల్లో భాగంగా 15.66 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసే ప్రక్రియ చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని, ప్రతి గ్రామంలో ముఖ్యమైన కూడళ్లు, రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నేరాల గుర్తింపు, నేరస్తుల ఆచూకీ కనుగొనడం,ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని సీఐ వివరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓ టి పి లు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణాకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కోస్గి సీఐ సైదులు మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులకు ప్రజలు సహకరించి నేరరహిత, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్, దామరగిద్ద ఎస్ఐ నరేష్, కోస్గి ఎస్సై 2, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking