కేజీబీవీ నూతన భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
-చౌటుప్పల్ కేజీబీవీ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే….
-తరగతి గదుల్లో బెంచీలపైనే విద్యార్థినుల నిద్ర..
-మూడేళ్లుగా పూర్తికాని గదుల నిర్మాణం…
-విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు….
-మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్ / అక్షిత న్యూస్ :
యాదాద్రి జిల్లా,చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కేజీబీవీ నూతన భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి పట్టణ కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం, తాగునీరు అందించాల్సిన బాధ్యతను సంబంధిత అధికారులు విస్మరిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. చౌటుప్పల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోందన్నారు.విద్యార్థినులు నూతన భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో తమకు ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి త్వరగా పూర్తి జరిగేలా చూడాలని కోరారు. పాఠశాలలో స్నానం చేయడానికి సరిపడా నీరు అందుబాటులో ఉండటం లేదని, కనీసం తాగడానికి కూడా నీటి కొరత ఎదురవుతోందని విద్యార్థినులు మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. విద్యార్థినులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం బాధాకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
-విద్యార్థులు నిద్రించడానికి సరిపడ గదులు లేవు…
మరోవైపు రాత్రి సమయంలో నిద్రించడానికి సరిపడా గదులు లేకపోవడంతో తరగతి గదుల్లోని బెంచీలపైనే నిద్రించాల్సి వస్తోందని విద్యార్థినులు కూసుకుంట్లకు తెలిపారు. విద్యార్థినులకు అవసరమైన వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని కూసుకుంట్లకు వివరించారు. విద్యార్థినులు వెల్లడించిన సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు, వసతి వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, యోగక్షేమాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో రీల్స్‌కే ప్రాధాన్యతా? స్థానిక ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు…
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తీరుపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. విద్యార్థినుల సంక్షేమం పట్ల ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.
మూడేళ్లుగా కొనసాగుతున్న గదుల నిర్మాణం.. ఎప్పుడు పూర్తవుతాయి?
పాఠశాలలో విద్యార్థినుల కోసం నిర్మిస్తున్న అదనపు గదుల పనులు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గదుల కొరత కారణంగా విద్యార్థినులు తరగతి గదుల్లోనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినుల సంక్షేమంలో నిర్లక్ష్యానికి తావుండకూడదు..
విద్యార్థినులకు తక్షణమే నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రమైన తాగునీరు, స్నానానికి సరిపడా నీటి సదుపాయం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థినుల వసతి సమస్యను వెంటనే పరిష్కరించి, నిర్మాణంలో ఉన్న గదులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, విద్యాభ్యాసం, యోగక్షేమాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న బాలికలకు కనీస సౌకర్యాలు కల్పించడం సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.