మేడ్చల్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం
– కాన్వాయ్ ఆపి నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేసిన కేటీఆర్
– గుమ్మడికాయతో దిష్టి తీసి, మంగళహారతులతో కేటీఆర్ కు స్వాగతం
– మేడ్చల్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్
మేడ్చల్, అక్షిత ప్రతినిధి:
ఆదిలాబాద్ లో జరగనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ లో ఘన స్వాగతం పలికారు. తన కాన్వాయ్ లో నగరం నుండి మేడ్చల్ జాతీయ రహదారి మీదుగా ఆదిలాబాద్ బయల్దేరి వెళ్తున్న కేటీఆర్ మేడ్చల్ లో జాతీయ రహదారిపై నాయకులను, కార్యకర్తలను చూసి తన కాన్వాయ్ ఆపి అభివాదం చేశారు. కేటీఆర్ కు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చామకూర మహేందర్ రెడ్డి ఎదురుగా వెళ్లి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ గుమ్మడికాయతో దిష్టి తీశారు. పలువురు మహిళ నాయకురాలు మంగళ హారతులతో స్వాగతం పలుకగా మరికొందరు కేటీఆర్ కు విజయ తిలకం దిద్దారు. అనంతరం కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేటీఆర్ ను చూసిన కార్యకర్తలు, అభిమానులు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు, నాయకులతో ఫోటోలు దిగి ఆదిలాబాద్ బయల్దేరి వెళ్ళారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.