ప్రశ్నిస్తే ఫిర్యాదులా..? వార్త రాస్తే బ్లాక్‌మెయిలా..?

ప్రశ్నిస్తే ఫిర్యాదులా..? వార్త రాస్తే బ్లాక్‌మెయిలా..?

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కమిషనర్ తీరుపై జర్నలిస్టు ప్రశ్నలు

-సర్వసభ సమావేశానికి
మీడియా అనుమతిపై కమిషనర్ లిఖితపూర్వక వివరణ

-సీడీఎంఏ ఆదేశాలపై వార్త
-మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ సమాచారం

-నాలుగు విచారణలకు అధికారులు హాజరైనా సమాధానం ఎక్కడ?
-ఐదవ విచారణ నేడు

పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి :

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగి, ఆధారాలతో వార్తలు ప్రచురిస్తున్న జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ వార్తలు రాసిన అనంతరం, సంబంధిత అధికారులపై ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో పరిణామాలు మరో మలుపు తిరిగినట్లు తెలుస్తోంది.ఇటీవల ఇస్నాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వసభ సమావేశానికి సంబంధించిన వార్తలో సమావేశం తలుపులు మూసివేసి నిర్వహించారని, మీడియాను లోపలికి అనుమతించలేదని జర్నలిస్టు పేర్కొన్నారు.

దీనిపై మున్సిపల్ కమిషనర్ పత్రికకు ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో.. కౌన్సిలర్లే చెప్పడంతోనే మీడియాను అనుమతించకుండా తలుపులు మూసివేసినట్లు పేర్కొన్నట్లు జర్నలిస్టు వెల్లడించారు.

ఈ వివరణ నేపథ్యంలోనే సీడీఎంఏ డైరెక్టర్ కమిషనర్‌కు ఫోన్ చేసి, సర్వసభ సమావేశం తలుపులు మూసి ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు జర్నలిస్టు పేర్కొన్నారు.దీనిపైనా సంబంధిత వార్త ప్రచురితమైంది.


మూడేళ్లుగా ఆర్టీఐ సమాచారం కోసం నిరీక్షణ..
ఇదే సమయంలో 2023లో దాఖలైన సమాచార హక్కు చట్టం దరఖాస్తులో అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు పూర్తి సమాచారం అందలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్ట భవన్, ఎంజె. మార్కెట్ హైదరాబాద్‌లో జరిగిన నాలుగు విచారణలకు సంబంధిత మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ, ఎంపీడీవో, అధికారులు హాజరైనప్పటికీ సమాచారం అందలేదని జర్నలిస్టు చెబుతున్నారు.ఇటీవల మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తమ వద్ద సమాచారం ఉందని, అయితే గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి నుంచి సమాచారం పంపించాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాసినట్లు పేర్కొన్నారని తెలిపారు.సమాచార హక్కు చట్టం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఉందని ప్రభుత్వ అధికారిక ఆర్టిఐ సమాచారంలో పేర్కొంది.సమాచారం ఇవ్వకపోవడం లేదా ఆలస్యం చేయడం వంటి పరిస్థితుల్లో చట్టం అప్పీల్,ఫిర్యాదు తదితర మార్గాలను కూడా కల్పిస్తోంది.
ఫిర్యాదు చేస్తే జర్నలిస్టుపైనే ఆరోపణలా?
అధికారుల పనితీరుపై ప్రచురించిన వార్తల ప్రతులు, సంబంధిత ఫిర్యాదు కాపీలు, తన వద్ద ఉన్న ఆధారాలను జతచేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు జర్నలిస్టు తెలిపారు.

అయితే సంబంధిత అధికారిపై చర్యల అంశం పక్కన పెట్టి, జిల్లా పౌర సంబంధాల శాఖ (డిపిఆర్ఓ) అధికారులు తమ సంస్థ ఎడిటర్‌కు ఫోన్ చేసి జర్నలిస్టు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు చేశారని, ఆర్టిఐ కింద ప్రశ్నలు అడుగుతున్నారని, జవాబుదారీతనం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పినట్లు జర్నలిస్టు పేర్కొన్నారు.
ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది ఎవరు…?
ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, అధికారిక రికార్డుల ఆధారంగా సమాచారాన్ని కోరడం, అధికారుల వివరణలను ప్రచురించడం జర్నలిజంలో భాగమేనని జర్నలిస్టు వర్గాలు చెబుతున్నాయి.అదే సమయంలో ఏ జర్నలిస్టుపైనైనా బ్లాక్‌మెయిల్ వంటి ఆరోపణలు ఉంటే వాటికి ఆధారాలు, ఫిర్యాదు వివరాలు, సంబంధిత విచారణ ద్వారా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

అధికారులపై ప్రశ్నలు అడిగితే అది బ్లాక్‌మెయిలా?
ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే అది తప్పా?
ప్రజా ప్రయోజన అంశాలపై వార్త రాస్తే జర్నలిస్టుపైనే ఆరోపణలు చేయడం ఎందుకు?
ఫిర్యాదులో సమర్పించిన ఆధారాలపై విచారణ ఎప్పుడు?
ఇవన్నీ ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ వ్యవహారంలో సమాధానం కోరుతున్న ప్రశ్నలుగా మారాయి.సంబంధిత అధికారులు తమ పూర్తి వాదనను, ఆధారాలను ప్రజలకు వెల్లడిస్తే ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లేదంటే అక్షిత తెలుగు దినపత్రిక ఎవ్వరికి భయపడకుండా.. ఎవ్వరికి లొంగకుండా.. జవాబుదారీతనంగా.. జర్నలిజంలో జర్నలిస్టుల విలువలు కాపాడుతూనే ముందుకు సాగుతోంది. ఇస్నాపూర్ పూరపాలక సంఘంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై త్వరలో మరో కథనంతో మీ ముందుకు అక్షిత తెలుగు దినపత్రిక ఉంటుంది. ప్రజల గొంతుకకు.. పారదర్శకతగా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ.. ప్రజా సమస్యలపై తమ కలంతో.. ప్రజలకు చైతన్యవంతులు చేస్తూ.. అవినీతి తిమింగిలాలపై అక్షిత కొట్లాడుతూనే ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking