మౌలిక విలువల పరిరక్షణకే “రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వేదిక”

మౌలిక విలువల పరిరక్షణకే “రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వేదిక”

సమాజహితం కోసమే “రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వేదిక” ఏర్పాటు*

– వేదిక కన్వీనర్ కె. రామచంద్రమూర్తి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రతి రంగంలోనూ విలువలు క్షీణిస్తున్న నేటి ఆందోళనకర పరిస్థితుల్లో, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే మౌలిక విలువలను పరిరక్షించేందుకే “రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వేదిక” (ఫోరం ఫర్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ) ఏర్పాటైందని, ప్రముఖ పాత్రికేయులు, వేదిక కన్వీనర్ కె.రామచంద్రమూర్తి స్పష్టం చేసారు.సోమవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జి. హరగోపాల్, శాసన మండలి సభ్యులు యం. కోదండరాం, సామాజిక ఆలోచనపరులు డాక్టర్ గాదె గోపాల్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి యం.వి.రెడ్డి, సీనియర్ న్యాయవాది జ్యోతి కిరణ్, వేదిక కో-ఆర్డినేటర్ దీప్తిలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో మొత్తంగా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో, రాజకీయ సంభాషణ రోజురోజుకూ దిగజారుతోందని, ఒకప్పుడు ఆత్మగౌరవం, పరస్పర గౌరవంతో కూడిన భాష స్థానంలో దూషణలు, అసత్యాలు, వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని, ఈ క్రమంలోనే సమాజంలో ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ విలువలు బలహీనపడుతున్నాయని రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తం చేసారు. భయమో, పక్షపాతమో లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిన సమయం ఆసన్నమైనందు వల్లే ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేసారు.తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విస్తృతమైన అంశమైనప్పటికీ, ఈ వేదిక ప్రధానంగా రాజ్యాంగ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం హామీ ఇచ్చిన విలువలు, హక్కులు, సంస్థల పరిరక్షణపై దృష్టి సారించడం శుభ పరిణామమన్నారు. కోట్లాది ప్రజల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రజాస్వామ్య వేదికలను ప్రతి పౌరుడు స్వాగతించాలని ఆయన కోరారు.ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి. హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కులు, పౌర స్వేచ్ఛలకు చురుకైన రక్షణ అవసరమని అన్నారు. ఈ కృషిలో పౌర సమాజం, విద్యావేత్తలు, మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, సంస్థల స్వేచ్ఛలపై ఒత్తిడి ఏర్పడినప్పుడు సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపై వేదిక చర్చిస్తుందని, వాస్తవాలు, సమాచార ఆధారంగా జోక్యం చేసుకుంటుందని తెలిపారు. సంబంధిత వర్గాలకు సూచనలు, సిఫారసులు అందించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల ఆందోళనలు, నిబద్ధతలను పంచుకునే పౌరులందరూ ఈ ప్రయత్నంలో తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేసారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది జ్యోతి కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓటు హక్కు పరిరక్షణ, డీలిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు.
సామాజిక విశ్లేషకులు డాక్టర్ గాదె గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలనకు ప్రజల దృష్టి మరింత అవసరమైన సమయంలో ఈ వేదిక ఏర్పడిందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పౌరుల్లో మరింత అవగాహన కల్పించేందుకు వేదిక పనిచేస్తుందని తెలిపారు.మాజీ ఐఏఎస్ అధికారి ఎంవి.రెడ్డి ఈ వేదికను స్వాగతిస్తూ, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తమ అనుభవం, నైపుణ్యాలను రాజ్యాంగ ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛల పరిరక్షణకు వినియోగించవచ్చని అన్నారు. ఈ కృషికి మీడియా సహకారం అవసరమని, భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో అంతర్భాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ వేదిక ఆధ్వర్యంలో సెమినార్లు, ప్రజా చర్చలు నిర్వహించడం, పరిశోధనలు చేపట్టడం, నివేదికలు మరియు సిఫారసులు ప్రచురించడం, పౌరులు మరియు రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరపడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. ఇంకా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, వేదిక కో-ఆర్డినేటర్ దీప్తి తదితరులు మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking