రోగులు, సహాయకులకు నగర పౌర సంఘం ఆహార పంపిణీ
– జీజీహెచ్ మల్కాజ్‌గిరిలో మానవతా సేవా కార్యక్రమం..
– అభినందించిన ఆసుపత్రి అధికారులు
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి :
ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, ఓపీ రోగులకు ఆహారం అందించాలనే మానవతా దృక్పథంతో నగర పౌర సంఘం ఆధ్వర్యంలో సోమవారం మల్కాజ్‌గిరిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.నగర పౌర సంఘం అధ్యక్షుడు రాచమల్లు ఇస్మాయిల్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, చిట్టి వీరయ్య, నరసింహ రెడ్డిలు ఆహారాన్ని ఉదారంగా ప్రాయోజితం చేసి రోగులకు, వారి సహాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ.. రోగులు, వారి సహాయకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగర పౌర సంఘం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమన్నారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు ఆసుపత్రిలో మానవతా దృక్పథాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.రోగులు, ప్రజల పట్ల నగర పౌర సంఘం అందిస్తున్న మద్దతు, మానవతా సేవలను జీజీహెచ్ మల్కాజ్‌గిరి అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమం జీజీహెచ్ మల్కాజ్‌గిరి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ సమక్షంలో జరిగింది. ఆసుపత్రి పీఆర్వో డాక్టర్ పి. వినోద్, ఏడీ రమేష్, ఏఓ యవ్వన్, ఆఫీస్ సూపరింటెండెంట్లు జి. వినయ్ కుమార్, విష్ణు ప్రసాద్, నాయక్, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

