గడప గడపకు… మువ్వన్నెల జెండా

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం:
————————————
స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 అగస్టుకు ముందు 7 రోజులు అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రంలో ‘భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 75 ఏండ్ల ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం’ నిర్వహణపై ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘అటు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో, దేశ స్వాంతంత్ర్యం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి అర్థం కావాల్సి వున్నది. 75 ఏండ్ల కాలంలో స్వతంత్ర భారతం ఎన్నో ఘన విజయాలను సాధించింది. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత దేశం పరిఢవిల్లుతున్నది. భారత స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి వున్నది. నాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకిక వాద, సమాఖ్యవాద విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరునిమీదున్నది. భారత దేశం భిన్న సంస్కృతులతో, విభిన్న భాషలు, మతాలు, ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలతో అత్యున్నత ప్రాపంచిక సార్వజనీన విలువలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచ దేశాల్లో భారతదేశానిది విలక్షణమైన సాంస్కృతిక జీవన విధానం. మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతికత పని వత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటితరం ఆచరించిన దేశభక్తి కానీ అంతటి భావోద్వేగం కానీ నేటి యువతలో ప్రదర్శితమౌతలేవు. ఇటువంటి వాతావరణాన్ని మనం పున:సమీక్షించుకోవాల్సివున్నది. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అక్కెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకున్నది. ఈ మేరకు పల్లె పట్నం వొకటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి వున్నది.’’ అని సీఎం తెలిపారు.

గడప గడపనా జాతీయ జెండా రెప రెపలాడాలె:
——————————————–
రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద జాతీయ పతాకం ఎగరాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన 1 కోటి 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నారు. ఇందుకు గద్వాల, నారాయణ పేట్, సిరిసిల్ల, పోచంపెల్లి, భువనగిరి వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్లివ్వాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద జాతీయ పతాకాన్ని అత్యున్నతంగా ఎగరవేయాలన్నారు. జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని జిఎడి అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయ జండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా జండాలను రూపొందించాలన్నారు. ఇందుకోసం అవసరమయ్యే జాతీయ పతాకాల ముద్రాణా ఖర్చు సహా దేశభక్తి ప్రచార కార్యక్రమాలకోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ప్రజల నడుమ సత్సంబంధాలు పెరగడానికి దేశభక్తి దోహదం చేస్తుంది:
—————————————————————
రాష్ట్రంలోని ప్రజా సంచార ప్రాంతాలు, బస్ స్టాండ్లు ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, సినిమా హాల్లు, షాపింగ్ మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటల్లు సహా ప్రధాన కూడల్లు రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి జాలువారేలా జాతీయ జండా రెప రెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎం, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ప్రజలు ఉద్యోగుల నడుమ సత్సంబంధాలు పెంపొందించే ఫ్రెండ్లీ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఉద్యోగుల్లో కూడా దేశభక్తిని రగిలించే సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ‘ఫ్రీడం రన్’ లను నిర్వహాంచాలన్నారు.

వజ్రోత్సవ దీప్తిని వెలిగించండి:
—————————-
పంచాయీతీ రాజ్, మున్సిపల్ శాఖల వారి సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా తగు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ నుంచి, దేశంలోని పలు ప్రాంతాల నుంచి, దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నాటితరం జాతీయ నాయకుల వివరాలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు యువత కోసం అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాల కార్యాచరణ:
—————————————————
పీజీ డిగ్రీ జూనియర్ కళాశాలలు సహా గురుకులాలు తదితర ప్రభుత్వ ప్రయివేటు కార్పోరేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సమా అన్ని రకాల విద్యాసంస్థల్లో పంద్రాగస్టుకు ముందు వారం రోజులు, పంద్రాగస్టుకు తర్వాత వారం రోజులు మొత్తం 15రోజుల పాటు నిర్వహించబోయే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాలను సీఎం అధికారులకు వివరించారు. ఇందులో ఆటల పోటీలు, వ్యాస రచన పోటీలు, వకృత్వ పోటీలు, చిత్రలేఖనం పోటీలు, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని ఉద్దీపన చేసే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలె… విధి విధానాల కోసం కమిటీ ఏర్పాటు:
——————————————————–————
అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల్లో పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలని సీఎం అన్నారు. ఆయా శాఖల ఉద్యోగులు పదిహేను రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల రోజువారీ షెడ్యూలను రూపొందించుకుని రెండు వారాల పాటు అమలు చేయాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధనాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

లెటర్ హెడ్ ల మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించుకోవాలె:
———————————————————-
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా సర్పంచ్ స్థాయి ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు వారి వారి లెటర్ ప్యాడ్ల మీద జాతీయ జెండా బొమ్మను ముద్రించుకోవాలని సీఎం సూచించారు.

మీడియా యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాల్గొనాలె:
————————————————-
పదిహేను రోజుల పాటు పత్రికల మాస్టర్ హెడ్స్ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించాలని, టీవీ ఛానల్స్ ల్లో 15 రోజుల పాటు జాతీయ పతాక చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలని ఆయా మీడియా యాజమాన్యాలకు సీఎం విజ్జప్తి చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సప్తాహం సందర్భంగా దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సీఎం కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking