తెలంగాణలో చారిత్రక సంపద.. కొలనుపాక గుడిలో అపురూప చిత్రాలు

తెలంగాణలో చారిత్రక సంపద.. కొలనుపాక గుడిలో అపురూప చిత్రాలు

– యక్షగాన ఘట్టాలు, ఊరేగింపు దృశ్యాలతో అద్భుతమైన మ్యూరల్స్

– 16, 17వ శతాబ్దాల నాటివని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడి

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో

రాష్ట్రంలో మరో చారిత్రక సంపద వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సోమేశ్వరాలయంలో అరుదైన వర్ణచిత్రాల ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఆలయ మండప ప్రవేశ ద్వారం లోపల, పైకప్పుకు ఉన్న రాతి దూలాలపై డంగుసున్నం పూతపై వేసిన ఈ రంగుల చిత్రాలు అపురూపంగా ఉన్నాయని చరిత్రకారులు తెలిపారు. ఈ వర్ణచిత్రాలను తొలుత చరిత్ర బృందం సభ్యుడు సిరిపురం నరేందర్ గమనించగా.. కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలోని బృందం పరిశీలించి విశ్లేషించింది.ఏదో ఒక యక్షగానంలోని కథాంశాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని వారు వెల్లడించారు. ఒకచోట విశ్వబ్రహ్మను ఊరేగిస్తున్న దృశ్యం స్పష్టంగా ఉంది. ఆ చిత్రం పైన ‘విశ్వబ్రహ్మ’ అని తెలుగులో రాసి ఉందని, ఆ లిపి కాలాన్ని బట్టి 16 లేదా 17వ శతాబ్దానికి చెందినవిగా నిర్ధారించవచ్చని హరగోపాల్ తెలిపారు. చిత్రాల్లో అక్కడక్కడా లేబుల్ పేర్లు కూడా కనిపిస్తున్నాయి.‘శరభ’, ‘సంగరోలు’ వంటి పదాలు చిత్రాల ప్రాధాన్యతను చాటుతున్నాయి. గతంలో పిల్లలమర్రి, కోటగుళ్లు, రాచకొండ రామాలయం వంటి చోట్ల ఇలాంటి మ్యూరల్స్ కనిపించాయని, భువనగిరి శివాలయంలోనూ ఇలాంటివి ఉండేవని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. కాలక్రమేణా అనేక దేవాలయాల్లో ఇలాంటి అద్భుత చిత్రకళాఖండాలు కనుమరుగవుతున్నాయని చరిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది.కొలనుపాకలో బయటపడిన ఈ చిత్రాలకు ‘కెమికల్ ట్రీట్మెంట్’ చేస్తే మరిన్ని వివరాలు, పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారసత్వ శాఖ వెంటనే స్పందించి ఈ చిత్రాలను రక్షించాలని సభ్యులు ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking