కల్తీ అల్లం తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
– ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు
– అక్రమంగా తరలిస్తున్న వాహనం, పోలీసుల తనిఖీలో పట్టుబడి
– కేసు నమోదు చేసిన పోలీసులు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
అక్రమంగా కల్తీ చేసిన అల్లం పేస్ట్ ను తరలిస్తున్న భారీ వాహనాన్ని రామన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రవి, రామన్నపేట ఎస్సై జి. సతీష్, పోలీసు సిబ్బంది కలసి రామన్నపేట సెంటర్ లో-వాహన తనిఖీలు నిర్వహించే క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎటువంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో అల్లం పేస్ట్ డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ ను విచారించగా, ఈ కల్తీ అల్లం పేస్ట్ కీసర ప్రాంతంలోని ఒక తయారీ యూనిట్ లో తయారు చేసినట్లు తెలిపాడు.దీనిపై వెంటనే పోలీసులు కీసర లోని సంబంధిత తయారీ కేంద్రానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో, కల్తీ అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం సంబంధిత ప్రాంగణంలో సోదాలు నిర్వహించి, కల్తీ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, యంత్రాలు, తయారైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణాపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని హెచ్చరించారు. ఈ చర్యను స్థానిక ప్రజలు అభినందిస్తూ, జిల్లా పోలీసు యంత్రాంగం మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రశంసించారు.
ఎస్ ఐ అప్రమత్తతతోనే వెలుగులోకి…
సాధారణ వాహన తనిఖీని కూడా నిశితంగా నిర్వహించిన ఎస్సై జి. సతీష్ సమయస్ఫూర్తితోనే ఈ భారీ కల్తీ ఆహార దందా వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యను స్థానికులు అభినందిస్తూ, ఎస్సై సతీష్ అప్రమత్తత వల్లే పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకట్ట పడిందని ప్రశంసించారు



