బాలాజీ నగర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ – కత్తి స్వాధీనం
– కాజిపేట్ ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, సీఐ శ్యాంసుందర్
కాజిపేట్, అక్షిత ప్రతినిధి :
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట బాలాజీ నగర్ లో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో మృతురాలి కుమారుడైన నాగుల దొరబాబు (20) తన తల్లి ప్రవర్తన, నడవడిక పట్ల ఉన్న అసహనం కారణంగా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 24 నాడు మృతురాలు తనకు అరెల్లి రాజశేఖర్ అనే ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌తో సన్నిహిత సంబంధం ఉందని, అతనితో కలిసి శాశ్వతంగా జీవించేందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తన కుమారుడికి తెలిపింది. ఈ విషయం విన్న నిందితుడు తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.ఆమె ఇంటి నుంచి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో, వంటగదిలో ఉన్న ఇనుప కత్తితో ఆమె మెడ ఎడమ వైపున పొడిచి, అనంతరం మెడ కోయడంతో ఆమె మృతి చెందినట్లు కేసు వివరాల్లో నమోదైంది. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలియజేశారు.నిందితుడి కోసం గాలింపు కొనసాగుతున్న సమయంలో, సెప్టెంబర్ 26 మధ్యాహ్నం కాజిపేట్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, కాజిపేట్ రైల్వే హాస్పిటల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు తెలియజేయబడింది. ఈ కేసులో ముఖ్యపాత్ర పోషించిన పోలీసులను కాజీపేట ఏసిపి అభినందించారు.