లోకేశ్వరంలో పండుగ వాతావరణం
ఘనంగా ఆషాడ మాస గోరింటాకు సంబురాలు
లోకేశ్వరం,జూలై 24 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, సజీవ సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస వేడుకలు మండల కేంద్రంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ మాసంలో మహిళలు ఎంతో పవిత్రంగా భావించి జరుపుకునే గోరింటాకు సంబురాలు పల్లెల్లో పండుగ శోభను తెచ్చాయి.మండల కేంద్రంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా ఒక్కచోట చేరి ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ చేతులకు పచ్చటి గోరింటాకు అద్దుకుంటున్నారు.ఆధునికత పేరుతో మార్కెట్లో రకరకాల కోన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పల్లెల్లో మాత్రం ఇప్పటికీ చెట్ల నుంచి తాజా ఆకులను సేకరించి, రోట్లో నూరి చేతులకు పెట్టుకునే స్వచ్ఛమైన ఆచారం ఇక్కడ కొనసాగుతుండటం విశేషం.వర్షాకాలంలో వచ్చే చర్మ సంబంధిత వ్యాధులను నివారించడంలో, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో ఆయుర్వేద పరంగా గోరింటాకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.కేవలం సాంప్రదాయమే కాకుండా,ఇది మహిళల ఆరోగ్యానికి చక్కటి రక్షణ కవచంలా నిలుస్తోంది.ఈ వేడుకలు కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా,మహిళల మధ్య సామాజిక బంధాలను, పరస్పర ఐక్యతను మరింత బలపరుస్తున్నాయి. సందడి వాతావరణంలో సాగుతున్న ఈ సంబురాలు తరతరాల మన సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి సగర్వంగా చాటుతున్నాయి…
