వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం
బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వచ్చిన రైతుకు షాక్..
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు
చిట్యాల అక్షిత ప్రతినిధి
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఉరుమోడ్ల రోడ్డులో ఉన్న వైన్స్ షాప్ ముందు నిలిపిన బైక్‌లో నుంచి రూ.50 వేల నగదు, రెండు ఎస్‌బీఐ చెక్కులు అపహరణకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు నుంచి వడ్ల విక్రయానికి సంబంధించిన డబ్బును డ్రా చేసుకుని బైక్‌పై చిట్యాలకు వచ్చాడు. అనంతరం ఉరుమోడ్ల రోడ్డులోని వైన్స్ షాప్ వద్ద బైక్‌ను నిలిపి మద్యం కొనుగోలు చేసేందుకు లోపలికి వెళ్లాడు.కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్‌లో ఉంచిన రూ.50 వేల నగదు, రెండు ఎస్‌బీఐ చెక్కులు కనిపించలేదు. స్థానికుల సమాచారం మేరకు, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి నగదు, చెక్కులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.