నేతన్నలను బీమా భరోసా
రైతు బీమా తరహాలో
రూ.5 లక్షలు
* ప్రతి కుటుంబానికి 10 లక్షల చేనేత బంధు కల్పించాలి
* చేనేత పెన్షన్ అందకపోతే తక్షణమే ఇవ్వాలి
బీసీ జేఏసీ నేత మారం శ్రీనివాస్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు అభినందనీయమని బీసీ జేఏసీ నేత మారం శ్రీనివాస్ తెలిపారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేత కార్మికుల కుటుంబాల్లో భరోసా నింపిందని అభిప్రాయపడ్డారు. రైతులు మృతిచెందినట్టయితే కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందజేస్తోందన్నారు. ఇదే తరహాలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి కార్మికుడి కుటుంబంలోని నామిని బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ చేయనున్నట్టు సీఎం ప్రకటించారని, ఈ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) నుంచి అమల్లోకి తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి త్వరలో కార్పస్ ఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. నిరుపేద చేనేత కుటుంబీకులకు గుర్తించి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని అభ్యర్ధించారు. కాగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన 400 మంది చేనేత కార్మికుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను అభ్యర్ధిస్తున్నట్టు మారం శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా అందజేయాలని ఆయన అభ్యర్ధించారు. చేనేత కార్మికులకు రైతు బంధు తరహాలో పెట్టుబడి సాయం అందజేయాలని, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను మంజూరు చేయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న చేనేత కార్మికులకు జియో టాగ్ విధానం అమలులో లేనందున ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తించే పరిస్థితిలేదని అభిప్రాయపడ్డారు. నేతన్నలకు సహకార సంఘాలలో సభ్యత్వం కూడా ఇచ్చి పని కల్పించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ను కోరనున్నట్టు ఆయన తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులను తక్షణమే చేయూత పథకంలో చేర్చాలని కోరారు. నూలు సబ్సిడీ పథకం లో మార్పులు చేసి ఎలాంటి అవకతవకలు లేకుండా 40 శాతం ప్రతి చేనేత కుటుంబానికి అందించాలని కోరారు. చేనేత పథకాలు వయసుతో సంబంధం లేకుండా వర్తింపజేయాలని మారం శ్రీనివాస్ అభ్యర్ధించారు.చేనేత పెన్షన్ అందకపోతే తక్షణమే ఇవ్వాలని కోరారు. చేనేత వస్త్రాలు అమ్ముడు పోక మగ్గాలు లేనివారికి ఉపాధి కల్పించాలని మారం శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభర్ధించారు. కార్యక్రమంలో చేనేత సంఘం అధ్యక్షుడు గుంటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఇప్ప వీరయ్య, వైస్ ప్రెసిడెంట్ ఏలే రాములు,కోశాధికారి రాపోలు కృష్ణమూర్తి, కర్నాటి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.