మన పోలీసు మకుటం సీ..సీ..సీ..

మన పోలీసు మకుటం సీ..సీ..సీ..

★ దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

★ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల
మీదుగా నేడే ప్రారంభం

★ గురువారం మధ్యాహ్నం 1.16 గంటలకు
శుభ ముహూర్తం

★ సీసీసీ.. దేశంలో ఒకే ఒక్కటి..:
మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్‌ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాసౌధం ఆవిష్కృతం కానున్నది. ఒకేచోట కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తోపాటు ఫ్యూజిన్‌ సెంటర్లు, ఇతర బ్యాక్‌ ఎండ్‌ పోలీస్‌ దర్యాప్తు, సాంకేతిక అంశాల సమాహారంగా ఉన్న ఏకైక సీసీసీ హైదరాబాద్‌లోనే నిర్మాణమైంది.

రాష్ట్ర భద్రతకు మరింత భరోసా.. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు సంబంధించి అన్ని అంశాల నియంత్రణ వేదిక.. విపత్తుల సమయంలో అన్ని విభాగాల సమన్వయ కేంద్రం.. తెలంగాణ పోలీస్‌ విభాగానికి కీర్తి కిరీటం.. దేశంలోనే ఏకైక ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) ప్రారంభానికి సంసిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సీసీసీని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం విడుదలచేశారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం సీసీసీకి సంబంధించిన జంట టవర్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సెంటర్‌ పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సృష్టి అని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వాడుకొనేలా తమను ప్రోత్సహించారని, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు అద్భుత రూపకల్పన జరిగిందని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు ఇక్కడి నుంచే సమన్వయం చేసేలా టెక్నాలజీ ఫ్యూజింగ్‌ సెంటర్‌ ఉంటుందని వివరించారు. సీసీసీ పూర్తిగా పర్యావరణ హిత భవనమని పేర్కొన్నారు. విద్యుత్తు ఖర్చులు తగ్గించేలా సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీసీసీ ప్రారంభం అనంతరం భవనంలోని వసతులను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కేసీఆర్‌ మదిలో పుట్టిన గొప్ప కట్టడం: వేముల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలోపుట్టిన మరో అద్భుత కట్టడం సీసీసీ అని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. ఈ కేంద్రం దేశానికే తలమానికంగా మారనున్నదని పేర్కొన్నారు. సీసీసీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం మంత్రి పర్యవేక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని సీఎం కేసీఆర్‌ భావిస్తారని, ఈ క్రమంలో గ్రీనరీకి ప్రాధాన్యమివ్వాలని ఏర్పాట్లు చూస్తున్న ప్రతినిధులకు సూచించారు. దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధునాతన హంగులతో, నూతన టెక్నాలజీతో నిర్మించిన ఏకైక భవ నం సీసీసీ అని అన్నారు. ఇంతటి చరిత్రాత్మక ఘట్టంలో తనకు భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి తెలిపారు. మంత్రి వెంట హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ అశోక్‌, ఇతర అధికారులు, డీసీపీలు జోయల్‌ డేవిస్‌, సునీతతోపాటు పలువురు పోలీసు అధికారులు, వాస్తు నిపుణులు సుధాకర్‌ తేజ, వర్‌ ఏజెన్సీ ప్రతినిధులున్నారు.

దేశంలోనే ఒకే ఒక్కటి: కేటీఆర్‌

ప్రపంచస్థాయి సాంకేతికతతో కొలువు దీరిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్వీట్‌ చేశారు. ‘ప్రపంచ స్థాయి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అత్యంత అధునాతన ప్రభుత్వ సదుపాయం భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించి ఉండదు. దేశంలో ఈ తరహా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇదొక్కటే అయ్యి ఉంటుంది’అని బుధవారం తన ట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking