ఘనంగా రథసప్తమి వేడుకలు
మందమర్రి, అక్షిత ప్రతినిధి: మందమర్రి పట్టణంలోని సింగరేణి యోగ క్లబ్ ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జీఎం చింతల శ్రీనివాస్, ఆయన సతీమణి లక్ష్మి శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రథసప్తమి అంటే సూర్యుని జన్మదినం అని, భారతీయ యోగ విద్యలో సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, నమస్కారల ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుందన్నారు.

చర్మ వ్యాధులు దరిచేరవని, కండరాల వృద్ధి, శరీర ఆకృతి చక్కగా తయారవుతుందన్నారు. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్య నమస్కార ప్రదర్శన మన ఆచారంగా వస్తుందన్నారు. సింగరేణి యోగ క్లబ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి యోగాసనాల ప్రదర్శన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి మార్గం యోగాని తెలిపారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కార్మిక కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏదైనా వ్యాధి బారిన పడితేనే యోగను ఆశ్రయిస్తున్నారని, అలా కాకుండా ప్రతినిత్యం యోగ సాధనను తన స్వభావంగా మార్చుకోవాలని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి మార్గం యోగా అన్నారు.
అంతకుముందు సూర్య నమస్కారాలు, యోగాసనాలు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒఎస్ రాజలింగు, వేద పండితులు అనంతచార్యులు, గ్రౌండ్ ఇన్చార్జి నాస్ఫూరి తిరుపతి, మాస్టర్ శంకర్, యోగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.