అక్షర యోధుడు… పల్లె రవికుమార్
గీత కార్మిక కార్పోరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు
కార్పోరేషన్ పటిష్టతకు పల్లె కృషి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : అక్షర యోధుడు… పల్లె రవికుమార్… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర జర్నలిస్టులను కలుపుకొని, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పేరుతో జర్నలిస్టుల ఐక్య పోరాటానికి పల్లె రవికుమార్ కృషి చేశారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిలో పల్లె రవికుమార్ సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి గౌడ సామాజికవర్గంతో పాటు, బీసీ నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గీతకార్మిక కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్‌గౌడ్ నియామకంపై పలు గౌడ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించడం ద్వారా గౌడ కులస్థులకు ఎంతో లబ్ధి చేకూరనున్నదని, సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అక్షరయోధుడు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బొడంగిపర్తి గ్రామానికి చెందిన పల్లె రవికుమార్‌గౌడ్ బీఎస్సీ, ఎంసీజే చదివారు. బీసీ సామాజికవర్గానికి చెందిన పల్లె రవికుమార్‌ది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం. తండ్రి పల్లె లింగయ్య సిపిఐ నుంచి సర్పంచిగా పనిచేశారు. పల్లె రవి విద్యార్థి దశలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై ఎన్నో కథనాలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులందరినీ ఏకంచేసి పోరుబాట పట్టించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలకంగా ఉన్న రవికుమార్.. అన్ని పార్టీల నేతలు ఉద్యమంలోకి వచ్చేలా కృషి చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిపోయిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మెలో జర్నలిస్టు నేతగా ముందు వరుసలో నిలిచారు. స్వరాష్ట్రంలోనూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చండూరు ఎంపీపీగా పల్లె రవి సతిమణి పల్లె కల్యాణి కొనసాగుతున్నారు. భర్త బాటలో ఆమె కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు