విద్యుత్ కోతలతో సతమతం…
లోకేశ్వరంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
లోకేశ్వరం, జూలై 16 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలకేంద్రంలో కరెంట్ కోతలు రైతాంగాన్ని రోడ్డుపైకి తెచ్చాయి. పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహించిన రైతులు, ప్రతినిధులు గురువారం లోకేశ్వరం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయానికి రోజుకు 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలి.కానీ, అధికారులు కేవలం 10 గంటలే ఇస్తూ, అది కూడా నాణ్యత లేని కరెంట్‌తో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ వచ్చే సమయాల్లో కూడా స్పష్టత లేకపోవడంతో, పంటలకు నీరు పెట్టడం రైతులకు గగనంగా మారింది.పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు, సమయానికి నీరందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కళ్లముందే పంటలు ఎండిపోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు.పరిస్థితి తీవ్రతను గమనించిన రైతులు,లోకేశ్వరం సబ్‌స్టేషన్ ఏఈ శివ కుమార్,ను నిలదీశారు.రైతులతో మాట్లాడిన ఏఈ,ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన పై అధికారులు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు.అయితే, ఇచ్చిన హామీ అమలు కాకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్వాడి కపిల్, ఉపసర్పంచ్ లక్కంపల్లి లక్ష్మి,ఫణిల్ రావు, మాజీ ఎంపిటిసి జై సాగర్ ర్రావు, రైతులు,సంటెనోలా గంగాధర్,ముత్యం, కమలాకర్ రావు, నాగరావు,గంగాధర్, తదితరులు ఉన్నారు…