ఒక పట్టణం.. మూడు పేర్లు!
యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో
భువనగిరి పట్టణానికి వాడుకలో మూడు రకాలుగా పేర్లు ఉండటంతో ప్రజలకు సమస్య ఎదురవుతోంది. దశాబ్దాలుగా తెలుగులో ‘భువనగిరి’, ఆంగ్లంలో ‘భోనగిర్’ పేర్లు వాడుకలో ఉన్నాయి. తెలుగులో రాసిన పక్షంలో భువనగిరి స్పష్టంగా వస్తుంది. దీనిని ఆంగ్లంలో బోనగిరి అని, కంప్యూటర్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్లో నమోదు చేస్తే భొంగిర్, భోనగిరి అనే పేర్లు వస్తున్నాయి. ఈ తరహాలో పట్టణంలో ఉంటున్న అందరి ఆధార్కార్డుల్లో నమోదవడం గమనార్హం. జిల్లాల పునర్విభజనకు ముందు ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించి ఉత్తర, ప్రత్యుత్తరాల్లో బోనగిరి అని రాసేవారు. పునర్విభజన అనంతరం జిల్లా పేరును యాదాద్రి భువనగిరిగా మార్చడంతో ప్రస్తుతం ఇదే పేరిట కొనసాగుతున్నాయి. విద్యార్థులు, విదేశాలకు వెళ్లేవారి పలు ధ్రువీకరణ పత్రాల్లో పట్టణం పేరు రెండు విధాలుగా ఉండటంతో తనిఖీ సమయంలో అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
చరిత్రేమో ఇలా
పూర్వం హిందూ రాజు ఒకరు రాయగిరి పరిసర ప్రాంతంలో దుర్గం నిర్మించాలన్న సంకల్పంతో తిరుగుతుండగా వీరికి భువన, గిరమ్మ దంపతులు తారస పడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. భువనగిరి కొండకు సంబంధించిన సమాచారాన్ని వీరు రాజుకు అందించారని పేర్కొంటున్నారు. చెట్లు, పొదల్లో ఉన్న ఈ కొండను రాజుకు చూపగా.. ఈ ప్రదేశాన్ని ఆయన నచ్చి ఆ దంపతుల పేరునే ‘భోనగిరి’గా నామకరణం చేశారని నానుడి.

