డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్..

డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్..

కంప్యూటర్ ఆపరేటర్ తొలగింపు..

క్రిమినల్ కేసు నమోదు

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో తీవ్రంగా కలకలం రేపిన భూ రికార్డుల అక్రమాలపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కఠిన చర్యలు తీసుకున్నారు. జీవించి ఉన్న రైతు జంచుక మసన్నను మృతుడిగా చూపిస్తూ తప్పుడు పత్రాలు సృష్టించి, ఆయనకు తెలియకుండానే పట్టాదారు భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకున్నారు.

విచారణలో సంచలన విషయాలు…

బాధిత రైతు ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరిపిన కలెక్టర్, రెవెన్యూ కార్యాలయంలో జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యాన్ని గుర్తించారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న మూడవత్ జైపాల్ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు తేలడంతో ఆయనను విధుల నుంచి తొలగిస్తూ, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.అదే సమయంలో ఘటన జరిగిన సమయంలో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ఉన్న ఎ. అశోక్ కుమార్ కూడా విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రికార్డుల నిర్వహణలో భారీ నిర్లక్ష్యం…

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, భూ-భారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) రూల్స్–2025 ప్రకారం వారసత్వ మార్పిడి కేసుల్లో సమర్పించే పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సంబంధిత అధికారి సరైన ధ్రువీకరణ లేకుండానే ప్రక్రియను పూర్తి చేసినట్లు తేలింది. దీనివల్లే జీవించి ఉన్న రైతును మృతుడిగా చూపిస్తూ రికార్డులు మారినట్లు గుర్తించారు. ఈ మార్పుల కారణంగా రైతు పట్టాదారు భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిగా నమోదు కావడం, రైతు హక్కులకు తీవ్ర నష్టం కలగడం వంటి అంశాలు బయటపడ్డాయి.తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు–1991లోని రూల్–8 ప్రకారం ఎ. అశోక్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కాలంలో ఆయనకు ప్రాథమిక వేతనం, అలవెన్సుల్లో 50 శాతం జీవనభృతి (సబ్‌సిస్టెన్స్ అలవెన్స్) చెల్లించనున్నారు.అలాగే విచారణ పూర్తయ్యే వరకు నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కేంద్రంగానే కొనసాగాలని, కలెక్టర్ అనుమతి లేకుండా జిల్లా విడిచి వెళ్లరాదని ఆదేశించారు. ప్రతి నెలా ఇతర ఉద్యోగం చేయడం లేదని ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కూడా సూచించారు.

కలెక్టర్ హెచ్చరిక..

భూ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు ఎలాంటి తావు ఉండదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రైతుల భూ హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking