భూదమ్మకు అండగా క్యాతనపల్లి చైర్‌పర్సన్
వృద్ధురాలికి ఇంటి నిర్మాణానికి హామీ
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బతినడంతో ఇబ్బందులు పడుతున్న వితంతు వృద్ధురాలు భూదమ్మకు అండగా నిలుస్తామని క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ రాజా రమేష్ హామీ ఇచ్చారు. చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులోని భూదమ్మ నివాసాన్ని ఆమె శుక్రవారం సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణానికి తన వద్ద ఆర్థిక స్థోమత లేదని భూదమ్మ ఆవేదన వ్యక్తం చేయగా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటామని డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు ఆమెకు సమీపంలోని మరో ఇంట్లో తాత్కాలిక వసతి కల్పించినట్లు తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలో నివాస సమస్యలు ఎదుర్కొంటున్న వారు కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం, సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత, మాజీ వార్డు కౌన్సిలర్ రామిడి ఉమా, నాయకులు రామిడి కుమార్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.